పుష్ప, పుష్ప రాజ్ నయా రికార్డు.. కేవలం బాలీవుడ్ లో 800 కోట్లకు అతి దగ్గరలో!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్ లో రూపొందిన ‘పుష్ప-2 ది రూల్‌’ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం, విడుదల తర్వాత తర్వాత సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. 28 రోజుల్లోనే ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 1799 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది.

ఇక‌ బాలీవుడ్‌లో పుష్ప2 సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు.తాజాగా ఈ చిత్రం మ‌రో మైలురాయిని చేరుకునేందుకు అడుగు దూరంలో ఉంది. హిందీలో 800 కోట్ల‌కు అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోయేలా వస్తున్న ఈ వసూళ్లు చూస్తుంటే.. త్వరలోనే భారత సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘పుష్ప-2’ నిలిచినా ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదు. హిందీలో నాలుగో వారంలో 57.95 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది.

నాలుగో వారంలో శుక్ర‌వారం 7 కోట్లు, శ‌నివారం 10.25 కోట్లు, ఆదివారం 12.25 కోట్లు, సోమ‌వారం 6.25 కోట్లు, మంగ‌ళ‌వారం 7 కోట్లు, బుధ‌వారం 10.50 కోట్లు, గురువారం 4.70 కోట్లు కలెక్షన్స్ సాధించిందని. మొత్తంగా నాలుగు వారాల్లో పుష్ప 2 మూవీ హిందీలో 798.20 కోట్ల నెట్ వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు చెప్పారు. ఈ రోజుతో పుష్ప‌2 మూవీ హిందీలో 800 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్ట‌డం ఖాయం అని ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కుడు త‌రుణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు.

ఇదంతా జరిగితే.. నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2000 కోట్ల క్లబ్బులో చేరుతుందేమో..? నక్కుకుంటూ కాదు.. తొక్కుకుంటూ పోవాలే.! ఇప్పుడు పుష్ప రాజ్ దూకుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కనిపించిన ఒక్క రికార్డును కూడా వదిలేలా కనిపించడం లేదు బన్నీ.పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. పుష్పకు మూడేళ్ల తర్వాత ఫుల్ క్రేజ్‍తో వచ్చిన ఈ సీక్వెల్ అంతకు మించి బ్లాక్‍బస్టర్ కొట్టింది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపారు.