సినీ ఇండస్ట్రీకి పైరసీ, లీకుల బెడద అతి పెద్ద సమస్యగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా లీకులని ఆపలేకపోతున్నారు. రాజమౌళి లాంటి బడా దర్శకుడే ఈ లీకులకు అడ్డుకట్ట వేయాలని ఎంత ప్రయత్నించిన కూడా లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా నుండి ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ లుక్ చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ ని పక్కా పల్లెటూరి వ్యక్తిలా చూపించిన సుక్కూ పుష్పలో డబుల్ మాస్ లుక్‌లో చూపించబోతున్నాడట.
లాక్‌డౌన్ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలో ఉన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అల్లు అర్జున్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసి తెలియజేసింది. బ్యాక్ లుక్‌లో కనిపించిన బన్నీని చూసి షాకయ్యారు ఫ్యాన్స్ . ఇక ఇప్పుడు లీకైన ఫొటోలో ఫ్రంట్ నుండే కనిపిస్తుండగా, ఇందులో అల్లు అర్జున్ మాసిపోయిన పట్టలు, జుట్టుతో చాలా రఫ్‌గా కనిపిస్తున్నారు. బన్నీ పక్కన ఒక నీలం రంగు జీపు కూడా కనిపిస్తోంది. దట్టమైన అడవిలో యాక్షన్ సీక్వెన్స్ జరుపుతున్నారని ఈ పరిస్థితులు చూస్తుంటే అర్ధం అవుతుంది.
లారీ డ్రైవర్ నుండి ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా పుష్పరాజ్ ఎలా మారాడు అనే కథతో సుక్కు పుష్ప చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన చిత్తూరు జిల్లాకు చెందిన అమ్మాయిగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నారు. కరోనా వలన దొరికిన టైంలో ఆమె చిత్తూరు యాస నేర్చుకుందట.తనకు ఇంత మంచి పాత్ర దొరకడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రష్మిక. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.