Pushpa 2: పాన్ ఇండియా సెన్సేషన్‌గా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. 2024 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ముఖ్యంగా హిందీలో 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం గమనార్హం. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన ఈ సినిమా, బాలీవుడ్ మార్కెట్‌ను కూడా షేక్ చేసింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ట్రెండ్ క్రియేట్ చేసిన పుష్ప 2 ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
సినిమా మొదట థియేటర్లలో 3 గంటల 15 నిమిషాల నిడివితో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో, మేకర్స్ రీ ఎడిటెడ్ వెర్షన్‌ను తిరిగి విడుదల చేశారు. ఈ రీలోడెడ్ వెర్షన్‌లో అదనంగా 20 నిమిషాల కొత్త సన్నివేశాలను జోడించి 3 గంటల 35 నిమిషాల నిడివితో థియేటర్లలో ప్రదర్శించారు. కథను మరింత నాటకీయంగా మార్చిన ఈ కొత్త కట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అన్ని సెంటర్స్‌లో తిరిగి వీక్షించడానికి సినీ ప్రేమికులు ఎగబడడం విశేషం.
తాజాగా పుష్ప 2 ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్లలో రీఎడిటెడ్ వెర్షన్ తర్వాత కూడా, ఓటీటీ ప్రేక్షకులకు మరో కొత్త అనుభూతిని అందించేందుకు మేకర్స్ మరో 9 నిమిషాల అదనపు ఫుటేజ్‌ను జోడించారు. దీంతో ఇప్పుడు ఓటీటీలో సినిమా మొత్తం 3 గంటల 44 నిమిషాల నిడివితో అందుబాటులోకి వచ్చింది. ఇది థియేటర్లలో చూసిన ప్రేక్షకులకు కూడా ఓటీటీలో మరోసారి చూసే ఆసక్తిని పెంచింది.
ఈ 9 నిమిషాల అదనపు ఫుటేజ్‌లో కొన్ని కొత్త యాక్షన్ సీక్వెన్స్‌లు, కథను మరింత లోతుగా చూపించే కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్, సినిమా మూడో భాగానికి ఓ బేస్ లైన్ ఇచ్చేలా కొన్ని క్లూ సీన్స్‌ను కూడా ఇందులో జోడించినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ వర్షన్‌లో కొన్ని కట్ చేసిన సన్నివేశాలను ఈ కొత్త వెర్షన్‌లో పునరుద్ధరించారు. దీంతో ఓటీటీలో సినిమాను మరింత ఇంపాక్ట్‌ఫుల్‌గా మార్చే ప్రయత్నం చేశారు.