పుష్ప నుంచి మరో రెండు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మొదటి పార్ట్ కి మించి ఉండేలా ఈ సీక్వెల్ ని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ తో పాటు ప్రమోషనల్ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చి రికార్డ్ స్థాయిలో దూసుకుపోయింది. టీజర్ అయితే ఏకంగా హిందీలో పఠాన్ రికార్డులని సైతం బ్రేక్ చేయడం విశేషం. ఇక కాళికాదేవి గెటప్ లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

ఈ లుక్ కి విపరీతమైన ప్రశంసలు లభించాయి. తిరుపతి గంగమ్మ తల్లి జాతర నేపధ్యంలో కాళికాదేవి అవతారంలో బన్నీ కనిపిస్తాడనే ప్రచారం వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మరో రెండు ఇంటరెస్టింగ్ లుక్స్ కూడా రాబోతున్నాయంట. ఆ రెండు కూడా గంగమ్మతల్లి జాతర నేపధ్యంలోనే ఉంటాయంట.

ముఖ్యంగా సినిమాలో విలన్స్ ని చంపడానికి పుష్ప రాజ్ ఇలా విభిన్నమైన గెటప్స్ లో వచ్చి వారిని అంతం చేస్తాడంట. కథలో ఈ ఎపిసోడ్స్ చాలా కీలకంగా ఉంటాయనే ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇక ఈ లుక్స్ కూడా మూవీలో నెక్స్ట్ లెవల్ లో ఉంటాయనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ప్రమోషనల్ టీజర్, ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

దీంతో మూవీకి మంచి మార్కెట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని టాక్. ఈ సినిమాతో వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. మూవీ బిజినెస్ కూడా 600 కోట్ల వరకు జరిగే అవకాశాలు ఉన్నాయనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది.