ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప 2 ది రూల్ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే బుధవారం రాత్రి నుంచి ప్రీమియర్ షోలు పడుతుండగా.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని రన్ అవుతుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఓపెన్ అవ్వలేదన్న విషయం తెలిసిందే.
గత నాలుగు రోజులు నుంచి అభిమానులు కూడా ప్రసాద్స్‌లో ఎప్పుడు స్టార్ట్ అవుతాయా ఎప్పుడూ బుకింగ్ చేద్దామా అని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ఏంటి అని చూస్తే.. ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యంకు.. ‘పుష్ప 2’ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌కి ఇంకా డీల్ కుదరట్లేదు అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రసాద్ నుంచి ఎక్కువ షేర్ మైత్రి అడిగినట్లు సమాచారం.
అయితే ఈ వార్తలపై ప్రసాద్స్ మల్టీప్లెక్స్ తాజాగా స్పందించింది. పుష్ప 2 సినిమాను ప్రసాద్స్‌లో ప్రదర్శించట్లేమని వెల్లడించింది. మా విలువైన స్పాన్సర్స్ కి, పార్టనర్స్‌కి.. 2 దశాబ్దాలకు పైగా.. మేము సినీ ప్రేక్షకులకి గొప్ప సినిమా అనుభూతిని అందించడానికి కట్టుబడి ఉన్నాము. అనుకోని కారణాల వల్ల, మేము పుష్ప 2 సినిమాను ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించలేక పోతున్నాము. ఈ విషయం మీకు ఇబ్బంది కలిగించి ఉంటే మేము దానికి చాలా చింతిస్తున్నాము.
ఈ విషయంలో మా హృదయపూర్వక క్షమాపణలు తెలుపుకుంటున్నాము. ఈ వివాదాన్ని అర్థం చేసుకొని మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. మీ మద్దతు.. విధేయత మాతో ఎల్లప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాము అంటూ ప్రసాద్స్ అధికారికంగా వెల్లడించింది.