South vs Bollywood: తెలుగు సినిమా దూకుడు.. బాలీవుడ్‌కి మరపురాని పాఠం

తెలుగు సినిమా హవా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలితో మొదలైన ఈ ప్రయాణం ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచ స్థాయికి చేరుకోగా, ఇప్పుడు పుష్ప 2 ది రూల్ నార్త్ బెల్ట్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాలీవుడ్ బీసీ సెంటర్లలో తెలుగు సినిమాల కోసం జనం బారులు తీరడం, టికెట్లు దొరకక కొట్టుకోవడం బాలీవుడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. గతంలో హిందీ సినిమాలకు దక్కిన గౌరవం ఇప్పుడు సౌత్ సినిమాలకు మారింది.

తాజాగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, టాలీవుడ్ నిర్మాత నాగవంశీ పాల్గొన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది. నాగవంశీ, తెలుగు సినిమా మేకింగ్‌లో మాస్ అండ్ క్లాస్‌ను ఒకటిగా మేళవించడమే విజయరహస్యం అని స్పష్టం చేశారు. బాలీవుడ్‌ మేకర్స్‌ కేవలం అర్బన్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తే, తెలుగు మేకర్స్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకాంక్షలను బేరీజు వేసి, వినోదాన్ని అందించడంలో ముందుంటారని అన్నారు.

పుష్ప 2 ఫస్ట్ డే హిందీలోనే రూ. 85 కోట్లకు పైగా వసూలు చేయడంపై బాలీవుడ్ వర్గాలు షాక్‌లోకి వెళ్లాయి. దీనికి తోడు, బోనీ కపూర్ పూర్వం హిందీ సినిమాలు బాహుబలి స్థాయికి దగ్గరగా ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నించినా, వారి నిర్లక్ష్య విధానం వల్లే ఆ స్థానాన్ని కోల్పోయారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బాలీవుడ్‌లో మాస్ కంటెంట్ తగ్గడం, హారర్ కామెడీ వంటి ఎజీ సినిమాలే ఎక్కువగా రావడం వల్ల ప్రేక్షకులు తెలుగు సినిమాల వైపుకు మొగ్గు చూపారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ పరిణామాలు బాలీవుడ్‌ను కూడా మార్పు వైపుకు నడిపే అవకాశం ఉంది. నాగవంశీ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా ఎదుగుదలకు దర్పణంగా నిలుస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో దేశాన్ని జయించే కంటెంట్‌ను టాలీవుడ్ అందిస్తోందని, బాలీవుడ్ సైతం ఇప్పుడు దీని గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.