Naga Vamsi: “సినిమాను చంపొద్దు..!” – నాగవంశీ సీరియస్ కౌంటర్!

మ్యాడ్ స్క్వేర్ సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ, రివ్యూవర్‌లు కంటెంట్ లేదని తేల్చేస్తున్నారని నిర్మాత నాగవంశీ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టికెట్ ధర తగ్గింపును ప్రకటిస్తూ, సినీ మీడియా, రివ్యూల వ్యవహారంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రేక్షకుల అభిప్రాయానికంటే రివ్యూవర్‌ల అంచనా తక్కువగా ఉందంటే, వాళ్లకే నిజంగా సినిమాల గురించి తెలియదేమో’’ అని ఆయన ఎద్దేవా చేశారు.

‘‘ఇది పుష్ప 2, బాహుబలి, కేజీఎఫ్ 2 కాదు. పెద్ద హీరోలు లేరు. కానీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే, కంటెంట్ ఉండకపోతేనే ఎలా నడుస్తుంది?’’ అని ప్రశ్నించారు. ‘‘సీక్వెల్ కాబట్టి ఆడుతోందని ప్రచారం చేస్తే, అలాంటి సినిమాలు ఎందరో తీస్తున్నారు.. అవన్నీ ఆడుతాయా?’’ అంటూ తాము చేసిన చిత్రానికి న్యాయం చేయాలని కోరారు. సినిమా ఆడితేనే సినిమా పరిశ్రమ బతుకుతుందని, అది మీడియా, వెబ్‌సైట్లకూ జీవనాధారం అని పేర్కొన్నారు.

రెండేళ్ల కష్టానికి ఇది ఫలితమని నాగవంశీ స్పష్టం చేశారు. ‘‘మా సినిమాల వల్లే మీ ఛానళ్లు, వెబ్‌సైట్లు నడుస్తున్నాయి. మేమే ప్రకటనలిస్తే మీకు ఆదాయం వస్తుంది. మరి మీరు సినిమాను ‘కంటెంట్ లేదు’ అని హైలైట్ చేస్తే, ప్రేక్షకుల మదిలో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. అది పరిశ్రమకు మంచిది కాదు’’ అని హెచ్చరించారు. రివ్యూలు వ్యక్తిగత అభిప్రాయంగా ఉండాలని, అందులో వ్యక్తిగత అజెండాలకోసం సినిమాలను తక్కువ చేస్తే ఊహించని నష్టాలు జరుగుతాయని అన్నారు.

‘‘సినిమా ఓ టీమ్ కృషి ఫలితం. అది బాగుంటేనే అందరం ఉంటాం. లేదంటే ఇంటికెళ్లాల్సిందే. నెగటివిటీ కాకుండా మద్దతు కావాలి’’ అంటూ మీడియాకు నాగవంశీ తుది హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.