Thalapathi Vijay: విజయ్ పొలిటికల్ గా సక్సెస్ అవ్వాలంటే.. ఒక్కటే దారి!

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, ఆయన ముందున్న అవకాశాలు, వ్యూహాలు తెగ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) విజయ్‌కు ఓ ఆసక్తికరమైన ప్రతిపాదన చేసారని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకుంటే, విజయ్ తన పార్టీ టీవీకే ద్వారా ఒంటరిగా బలమైన విజయం సాధించడం అంత సులభం కాదని పీకే విశ్లేషించారు. అందుకే విజయ్ కోసం ముందుగా ఓ వ్యూహాన్ని రూపొందించారని తెలుస్తోంది.

పీకే సూచించిన ప్రణాళిక ప్రకారం, అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే మధ్యే పోటీ తప్పడం లేదు. అన్నాడీఎంకేకు సుమారు 25% ఓటు బ్యాంక్ ఉంటే, విజయ్ పార్టీకి గరిష్ఠంగా 20% ఓట్లు వచ్చే అవకాశం ఉందని లెక్కగట్టారు. అంటే, తన పార్టీకి వచ్చిన ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని, అందుకే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే, వారి ఓటు బ్యాంక్‌తో కలిసి అధికారం చేపట్టగలమని విజయ్‌కు సూచించారట. ఈ ఒప్పందం కింద, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిసామి సీఎం కాగా, విజయ్ డిప్యూటీ సీఎం పదవిని పొందవచ్చని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ మాదిరిగా అన్నమాట.

అయితే, ఈ ప్రతిపాదన విజయ్‌ను అయోమయానికి గురి చేసింది. తాను కొత్త పార్టీ పెడితే, ఒంటరిగానే గెలవాలని అనుకున్న విజయ్‌కు, పీకే చెప్పిన ఈ వ్యూహం అంతగా నచ్చలేదట. రాజకీయంగా స్థిరపడాలని చూస్తున్న ఆయన, ఇప్పటివరకు ఏ పొత్తుల గురించి మాట్లాడలేదు. కానీ, తమిళనాడు రాజకీయ వాస్తవాలను పరిశీలించిన పీకే, ఒంటరిగా పోటీ చేసి పెద్ద విజయాన్ని సాధించడం కష్టమని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇప్పుడు ప్రశ్నేంటంటే, విజయ్ పవన్ కళ్యాణ్ మాదిరిగా సమయానుసారంగా నిర్ణయం తీసుకుని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగతాడా? లేక సొంత పార్టీకి పట్టుదలగా కట్టుబడి, ఎలాంటి పొత్తుల్లేకుండా స్వతంత్రంగా బరిలోకి దిగుతాడా? రాజకీయంగా విజయ్ ఏ దిశగా ముందుకు వెళ్తాడన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

టన్నెల్‌ తీవ్ర విషాదం || Cine Critic Dasari Vignan EXPOSED SLBC Tunnel Incident || Telugu Rajyam