ఒక్కోసారి ప్రేమను వ్యక్తపర్చడానికి మనం కూడా కవులం, రచయితలమైతే ఎంత బాగుంటుందో అనుకుంటుంటాం. అవతలి వ్యక్తికి మన ప్రేమను తెలియజేయడానికి, అందంగా వివరించడానికి ఎన్నో అవస్థలు పడుతుంటాం. అలాంటి సమయంలోనే అలా అనుకుంటాం. అయితే తాజాగా పూజా హెగ్డే సైతం ఇలాంటి పరిస్థితుల్లోనే పడింది. అయితే ఆమె తన ప్రేమను వ్యక్తపరిచేది బయటి వ్యక్తి మీద అయితే కాదులేండి. తన అమ్మ మీద ఎంత ప్రేముందో చెప్పేందుకు అలా చెప్పుకొచ్చింది.
పూజా హెగ్డే తన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. అయితే ఈ క్రమంలో తనపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు కవిని అయితే బాగుండును అంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఈ బుట్టబొమ్మ చేసిన పోస్ట్, షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. హేయ్ మామ్.. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో.. నువ్వంటే నాకెంత ప్రాణమో మాటల్లో చెప్పల్లేను. నేను కవినో లేదా ఇంకోటో ఏదో ఒకటి అయితే బాగుండును.. నా ప్రేమను అలా పదాల్లో, మాటల్లో వ్యక్తపరిచేదాన్ని.
కానీ నేను కవిని కాలేకపోయాను.. దానికి బదులుగా నాకు తెలిసిన విధంగా నా ప్రేమను నువ్ ఫీల్ అయ్యేలా చేస్తాను అంటూ ప్రేమగా హత్తుకుంది పూజా హెగ్డే. ఆ ఫోటోను షేర్ చేసిన పూజా హెగ్డే.. హ్యాపీ బర్త్ డే మామ్.. నిన్ను గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను.. నీ కలలన్నీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాను అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే.. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో బిజీగా ఉంది.