టాలీవుడ్ లో పోలీస్ స్టొరీలతో సినిమా వస్తుంది అంటే ముందుగానే హిట్ కోటాలో వేసేసుకుంటారు. సొసైటీలో పోలీస్ ని హీరోలా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈ కారణంగానే మన హీరోలు పోలీస్ రోల్స్ లో సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులు చూసి ఆశ్వాదిస్తూ ఉంటారు. అయితే పోలీస్ కథలకి హీరో క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ ఫుల్ గా ఉండాలో కథలో విలన్, కంటెంట్ నేరేషన్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉండాలి.
పోలీస్ క్యారెక్టర్ తో సినిమాలు చేస్తే కచ్చితంగా అందులో పెర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే కూడా ఉంటుందని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన పోలీస్ స్టొరీ కథల ఫలితాలు చూస్తూ ఉంటే వాటికి కాలం చెల్లిందా అనిపిస్తుంది. రామ్ పోతినేని హీరోగా ది వారియర్ మూవీ పోలీస్ స్టొరీ కథతో వచ్చింది. పక్కా కమర్షియల్ లెక్కలతో తీసిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
తరువాత సుదీర్ బాబు హంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ స్క్రీన్ ప్లే బాగానే ఉంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా పవర్ ఫుల్ గా ప్లాన్ చేశారు. అయితే మూవీ క్లైమాక్స్ ని ఆడియన్స్ డైజిస్ట్ చేసుకోలేకపోయారు. అలాగే సుదీర్ ని ఒక గే తరహాలో చూపించడం ఆడియన్స్ కి నచ్చలేదు. తరువాత శ్రీవిష్ణు అల్లూరి మూవీతో పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
కిరణ్ అబ్బవరం మీటర్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. అయితే పేరుకే పోలీస్ ఆఫీసర్ తప్ప సినిమాలో ప్రేక్షకులని మెప్పించే ఎలిమెంట్స్ అస్సలు లేవని తేల్చేశారు. దీంతో డిజాస్టర్ అయ్యింది. అల్లరి నరేష్ కెరియర్ లో మొదటి సారి సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా, యాక్షన్ హీరోగా ఉగ్రం మూవీలో కనిపించాడు. సినిమా కథాంశం బాగున్న ఎందుకనో ఆడియన్స్ ని కనెక్ట్ కాలేదు.
అలాగే నాగ చైతన్య కూడా కెరియర్ లో మొదటి సారి పోలీస్ రోల్ లో చేసిన కస్టడీ మూవీ ప్రేక్షకుల తిరస్కరణకి గురైంది. ఇలా ఈ మధ్యకాలంలో ఏకంగా ఆరు కాప్ స్టోరీస్ డిజాస్టర్ అయ్యాయి. అయితే ఈ సినిమాలలో ప్రేక్షకులని మెప్పించే అంశాలు లేకపోవడం వలనే అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాలేదని చెప్పొచ్చు.