పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో మంచి స్నేహితుడు ఎవరు అంటే ముందుగా త్రివిక్రమ్ పేరు చెప్తుంటారు కానీ ఆయన కంటే ముందు పవన్ మనసు అర్థం చేసుకున్న స్నేహితుడు కమెడియన్ అలీ. ఈ ఇద్దరూ ఎంత మంచి స్నేహితులు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాతికేళ్ల నుంచి వీళ్ల స్నేహం కొనసాగుతుంది. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాక ముందు నుంచి కూడా ఆయనతో అలీకి మంచి స్నేహం ఉంది. వచ్చిన తర్వాత అది ఇంకా బలపడింది. మధ్యలో ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే పవన్ సినిమా అంటే అందులో అలీ ఉండాల్సిందే.
తన సినిమాలో అలీ లేకపోతే ఏదోలా ఉంటుందని అప్పట్లో తీన్‌మార్ ఆడియో వేడుకలో చెప్పాడు పవర్ స్టార్. అయితే ఎంతమంది స్నేహితుల మధ్య అయినా అప్పుడప్పుడూ మనస్పర్థలు అయితే వస్తుంటాయి. అలీ, పవన్ మధ్య కూడా అలాగే వచ్చాయి. కొన్ని రోజుల కింద రాజకీయాలు వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాయి. జనసేన కాకుండా మరో పార్టీలో చేరిన అలీపై అప్పట్లో పవన్ కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు. దానిపై అలీ కూడా సీరియస్‌గానే స్పందించాడు. అది జరిగి ఏడాదిన్నర దాటిపోయింది. అప్పట్నుంచి మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవు అన్నట్లుగా ఉన్నారు అలీ, పవన్. బయట కూడా పెద్దగా కనిపించింది లేదు.
ఈ ఇద్దరికి ఒకరంటే ఒకరికి గౌరవం మాత్రం అలాగే ఉంది. అందులో ఏ మాత్రం తగ్గలేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ తెలిసిన వాళ్ల పెళ్లిలో కలిసారు. ఈ ఫోటో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్, అలీ కలిసి నవ్వుతూ పోజులిచ్చారు. దాంతో ఈ ఇద్దరి మధ్య అన్నీ సమసిపోయాయని.. మళ్లీ కలిసి నటించడం ఖాయం అయిపోయిందంటున్నారు అభిమానులు. త్వరలోనే ఈ కాంబినేషన్‌ను మళ్లీ తెరపై చూడొచ్చని నమ్ముతున్నారు. పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోషియుమ్, క్రిష్ సినిమా, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలతో బిజీగా ఉన్నాడు.