పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత నిరీక్షిత చిత్రాల్లో ఒకటైన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ మరోసారి ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూన్ 12న థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు పూర్తికావడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బాకీగా ఉండడంతో పాటు, బిజినెస్ ఒప్పందాల్లో స్పష్టత రాకపోవడం వలన నిర్మాతలు ఒత్తిడిలో ఉన్నారు. ఈ సమయంలో వాయిదా వేస్తే ఎదురయ్యే ఆర్థిక నష్టాలు కూడా పెద్ద సమస్యగా మారాయి.
ప్రధానంగా ఓటీటీ సంస్థతో ముందుగా కుదిరిన భారీ డీల్ ఇప్పుడు నిర్మాతల చేతులు కాల్చేలా చేస్తోంది. ఓటీటీ సంస్థలు ముందుగానే డిజిటల్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా ప్రమోషన్ ప్లాన్ చేస్తాయి. అలా చూసుకుంటే, జూన్ 12కు సినిమా విడుదల కాకపోతే సంస్థ రూ.20 కోట్ల వరకూ డీల్‌ను తగ్గించే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు జూన్ 12న థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నిస్తున్నా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడుతుందో లేదో అనేది అనుమానమే.
అంతేకాదు, జూన్ లో విడుదలైనా థియేట్రికల్ వసూళ్లు ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ భాద్యతలతో బిజీగా ఉండటంతో ప్రమోషన్స్ లో భాగం కావడం కష్టమవుతుంది. సినిమా మార్కెటింగ్ లో ఆయన ప్రెజెన్స్ కీలకం కావడంతో, ఎలాంటి ప్రమోషన్ లేకుండా రిలీజ్ చేస్తే బయ్యర్లకు డౌట్ వస్తుంది. పైగా తాజా పరిస్థితుల్లో థియేటర్లలో కలెక్షన్లు భారీగా పడిపోయే అవకాశం ఉండటం, ఓటీటీ డీల్ కోత వల్ల అదనంగా రూ.20 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉండటంతో, ఈ వాయిదా నిర్మాతలకు భారంగా మారబోతుంది. అన్ని దృష్ట్యా హరిహర వీరమల్లు నిర్మాతలకు ఈ రిలీజ్ డేట్ మార్పు చాలా కఠిన నిర్ణయంగా మారింది.