పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇంకోస్సారి.!

రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్, ఎన్నికలయ్యాక తాను సగంలో వదిలేసిన సినిమాల్ని పూర్తి చేస్తారా.? లేదా.? అన్నదానిపై అభిమానుల్లో కొంత ఆందోళన వున్నమాట వాస్తవం. అయితే, ఆయా చిత్రాల దర్శకులు, నిర్మాతలు.. ఆయా సినిమాల విషయమై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నారు.

ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్, దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో.. అంటూ, గణేష్ మాస్టర్ ‘గౌడ్ సాబ్’ సినిమాని ఇటీవల లాంఛనంగా ప్రారంభించాడు.

ప్రభాస్ కజిన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కథ గురించి ముందే పవన్ కళ్యాణ్‌కి చెప్పాడట దర్శకుడు గణేష్. అంతే కాదు, తనకు ఈ సినిమా విషయమై పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కూడా తీసుకున్నాడట.

ఆశీస్సులు అంటే, సినిమాకి ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ హెల్ప్ చేయడం లాంటిదన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏం సాయం చేయగలరు.? మాట సాయం.. అదే, సినిమాకి వాయిస్ ఓవర్ లాంటిది.

‘సర్లే చూద్దాం..’ అని కాకుండా, చేద్దాం.. అని పవన్ కళ్యాణ్ హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ, వీలైనంత తర్వగా వాయిస్ ఓవర్‌కి సంబంధించిన బైట్ తీసుకోవాలని దర్శకుడు గణేష్ మాస్టర్ అనుకుంటున్నాడట.