పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే అభిమానులకు పండుగే. అయితే, రాజకీయాల్లో అడుగుపెట్టి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా పవన్ సినీ రంగాన్ని మర్చిపోకుండా తనదైన శైలిలో వ్యవహరిస్తున్న తీరు అందరికీ ఆచరణకు నిలుస్తోంది. థియేటర్లలో ఫుడ్ రేట్లు, టికెట్ ధరలు, షో టైమింగ్స్‌పై పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతానికి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.
ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతోంది. జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మిడ్‌నైట్ షోలు పెట్టాలని డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్‌కు పవన్ ఇచ్చిన సమాధానం కొంచెం షాకింగ్. అభిమానుల భద్రతే ప్రథమమని చెబుతూ అర్ధరాత్రి ప్రదర్శనలకు నో చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల కొన్ని థియేటర్లలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు గుర్తు చేస్తూ.. అలాంటి పరిస్థితులు రాకూడదని పవన్ సూచించినట్టు సమాచారం. తన సినిమా అయినా ప్రత్యేకంగా ట్రీట్ చేయకూడదన్న స్పష్టతతో మాట్లాడారట.
ఇక దీనికి సంబంధించి నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చలు జరుపుతున్నట్టు టాక్. అర్ధరాత్రి షోలకు అవకాశం లేకపోతే తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్ షోలు వేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయినా అభిమానులంతా మాత్రం “పవన్ సినిమా.. ప్రీమియర్స్ మిస్ కాకూడదు” అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మొత్తానికి.. పవన్ తన ప్రిన్సిపల్స్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదన్నది మరోసారి స్పష్టమైంది.