Pawan Kalyan: పవన్.. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పాల్సిన టైమ్ వచ్చిందా?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన, జనసేన పార్టీ భవిష్యత్తు కోసం మరింత గట్టిగా నిలబడాల్సిన సమయం ఇది. అయితే, ఇటువంటి స్థాయిలో రాజకీయ బాధ్యతలు ఉండగా, ఆయన మళ్లీ సినిమాలు చేస్తారా లేదా అనే ప్రశ్నలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేన ఆవిర్భావ సభలో కూడా ఆయన సినిమాల గురించి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం ఈ ఊహాగానాలను మరింత బలపరిచింది.

ఇటీవల పవన్ తన ఆరోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా ఇది ఎంతవరకు నిజమో సూచిస్తున్నాయి. తన రెండో కుమారుడిని ఎత్తుకునేందుకు కూడా శక్తి లేకపోయిందని చెప్పిన ఆయన, అభిమానుల మద్దతుతో ముందుకు సాగతానని చెప్పారు. దీనితో పాటు రాజకీయ ప్రాధాన్యత పెరిగిన ఈ పరిస్థితుల్లో సినిమాలపై దృష్టి పెట్టడం కష్టమని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న హరిహర వీరమల్లు – 1, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాలు పూర్తయిన తర్వాత ఇక మేకప్ వేసుకుని సెట్స్‌లో కనిపించడా? అన్నది సందేహాస్పదంగా మారింది.

గతంలో పవన్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించినా, పార్టీ నడిపేందుకు అవసరమైన నిధుల కోసం తిరిగి సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనసేన అధికారంలో భాగమవ్వడం, పవన్ డిప్యూటీ సీఎం హోదాలో కీలక శాఖలను చూసుకోవడం వల్ల సినిమాలకు సమయం కేటాయించడం సాధ్యం కాదు. ముఖ్యంగా, మంత్రిత్వ బాధ్యతలతో పాటు రాజకీయ కార్యాచరణ పవన్‌కు పూర్తిగా ఓ క్రమాన్ని ఏర్పరచింది. అందుకే, ఒకవేళ ఈ సినిమా ప్రాజెక్టుల తర్వాత పవన్ సినిమాలకు స్వస్తి పలికినా ఆశ్చర్యం లేదు.

దీంతో, పవన్ అభిమానుల దృష్టి మరో ఆసక్తికరమైన అంశంపై పడింది. వచ్చే రెండు సంవత్సరాల్లో ఆయన తన తనయుడు అకీరా నందన్‌ను సినీ ఇండస్ట్రీలోకి లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో పవన్ స్థిరపడిన తర్వాత, తన వారసుడిని హీరోగా పరిచయం చేయాలని చూస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇకపై పవన్ పూర్తిగా రాజకీయాల్లో కొనసాగుతారా? లేక పార్ట్-టైమ్ గా సినిమాలు చేస్తారా? అనే అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.