ధర్మం కోసం యుధ్ధం…త్వరలో.. ‘హరిమర వీరమల్లు’పై తాజా ప్రకటన!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ కాంబినేషన్‌లో ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏ. దయాకర్‌రావు ‘హరిమర వీరమల్లు’ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఎటువంటి వార్తలు వైరల్‌ అయ్యాయో తెలియంది కాదు.

అయితే వెంటనే మేకర్స్‌ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ‘హరిమర వీరమల్లు’ చిత్రీకరణ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలకు వెంటనే బ్రేక్‌ వేయడమే కాకుండా.. విడుదల ఎప్పుడనేది కూడా మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఈ లోపు టీజర్‌ కూడా విడుదల చేస్తామని మేకర్స్‌ ఇచ్చిన అప్డేట్‌తో.. ‘హరిమర వీరమల్లు’పై వస్తున్న వార్తలకి ఫుల్‌స్టాప్‌ పడింది. ఇక శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని తాజాగా మేకర్స్‌ మరో అప్డేట్‌ వదిలారు. విూ ముందుకు… ’ధర్మం కోసం యుధ్ధం’ త్వరలో! అని తెలుపుతూ.. టీజర్‌ అతి త్వరలో విడుదల చేయనున్నామని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ సంస్థ అధికారికంగా ట్విట్టర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతూ.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ ట్వీట్‌కు మెగా ఫ్యాన్స్‌ కూడా ’వెయిటింగ్‌’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే.. ‘త్వరలో..’ అని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఒక డేట్‌ అనేది చెప్పొచ్చుగా అంటూ ఫ్యాన్స్‌ చేస్తున్న కామెంట్స్‌ కూడా వైరల్‌ అవుతున్నాయి. ఏదయితేనేం..’హరిహర వీరమల్లు’ సినిమా ఆగిపోయిందని అసత్య ప్రచారాలు చేసే వారికి ఛాన్స్‌ ఇవ్వకుండా.. మేకర్స్‌ మంచి ప్రయత్నమే చేస్తున్నారని చెప్పొచ్చు.

అలాగే ‘శ్రీరామనవమి’ ఫెస్టివల్‌ స్పెషల్‌గా విడుదల చేసిన ‘ధర్మం కోసం యుధ్ధం’ కోట్‌ కూడా.. సినిమా ఏ విధంగా ఉండబోతుందనేది క్లారిటీ ఇస్తుందని, పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలవడం పక్కా అనేలా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు.