ఇటీవల మన తెలుగు హీరోలు కొందరు రీమేక్‌లపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్‌ని పింక్ రీమేక్‌గా చేశాడు. ఇక మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాని ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో చేస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేసే మూవీ కూడా రీమేక్ అనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ రీమేక్స్‌ని తెలుగు నేటివిటీకి అనుగణంగా కాస్త మార్చితే ఓకే కాని కథనే అటు ఇటు చేస్తే చేతులు కాల్చుకోక తప్పదు అని హెచ్చరికలు చేస్తున్నారు అభిమానులు.
మలయాళ చిత్రాన్ని ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. సాగర్ కె.చంద్ర తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం మలయాళంలో బిజూ మీనన్ – పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది. బిజూ మీనన్ పోషించిన పోలీస్ పాత్రని తెలుగులో పవన్ పోషిస్తున్నాడు. పృథ్వీరాజ్ పాత్రలో రానా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం ప్రకారం పృథ్వీరాజ్ పాత్రని తెలుగులో పూర్తిగా తీసేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
సినిమాలో తన పాత్రనే ఎక్కువగా హైలైట్ చేస్తూ స్క్రిప్ట్ రూపొందించమని దర్శకుడికి చెప్పాడట పవన్. దీంతో సాగర్ మళ్ళీ స్క్రిప్ట్ ని పునరుద్దరించే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రానికి తెలుగు రీమేక్ లో అయ్యప్ప ని హీరోగా.. కోశి ని విలన్ గా చూపించనున్నారట. విలన్ పాత్రలో హీరోలు కాకుండా గతంలో విలనిజం ప్రదర్శించిన యాక్టర్స్‌ని తీసుకోవాలని పవన్ సూచించినట్టు తెలుస్తుంది. ఇక మాటల మాంత్రికుడు ఈ సినిమాకి పవర్ ఫుల్ డైలాగ్స్ అందిస్తున్నాడని, థమన్ సంగీతం సమకూరుస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కానున్న ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్ కానుందని టాక్.