‘పుష్ప-2’ కోసం పార్టీ సాంగ్.! అందాల భామల జాతర.?

‘పుష్ప 2 ది రూల్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టీజర్ రిలీజ్‌కి రంగం సిద్ధమయ్యింది. హీరోయిన్ రష్మిక పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. శ్రీవల్లి బాగా రిచ్.. అనే కలరింగ్ కనిపిస్తోంది ఆ పోస్టర్‌లో.!

‘పుష్ప ది రైజ్’ సినిమాకి సంబంధించి చిత్రీకరించిన ‘ఊ అంటావా మావా’ స్పెషల్ సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. సమంత ఈ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. మరి, ‘పుష్ప – 2’ కోసం ఇంకెలాంటి మ్యాజిక్ చెయ్యబోతున్నారు.?

ఐటమ్ సాంగ్ సంగతెలా వున్నా, ఓ పార్టీ సాంగ్ అయితే సినిమాకి సెంటరాఫ్ ఎట్రాక్షన్ కాబోతోందనేది తాజా ఖబర్. ‘కింగ్’ సినిమాలో పార్టీ సాంగ్ గుర్తుందా.? బోల్డంత మంది హీరోయిన్లు ఆ పాటలో కనిపిస్తారు.

బాలీవుడ్ మూవీ ‘ఓం శాంతి ఓం’ సినిమా నుంచి ప్రేరణ పొంది, తెలుగులో నాగార్జున ‘కింగ్’ సినిమాలో అలాంటి పాట పెట్టారు. ఇప్పుడు ఆ స్థాయిలోనే.. కాదు కాదు, అంతకు మించి వుండేలా పార్టీ సాంగ్ ఒకటి ప్లాన్ చేశారట.

త్వరలోనే సాంగ్ షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. టైటిల్ కార్డ్స్‌ సమయంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫిలిం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

‘పుష్ప 2 ది రూల్’ తర్వాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.