Karuna Kumar : చిన్న సినిమాగా వచ్చి మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్న సినిమా పలాస 1978. 1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’.కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో రక్షిత్, నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక రఘు కుంచె కీలక పాత్రలో నటిస్తూ సంగీతాన్ని అందించారు.ధ్యానం అట్లూరి ఈ సినిమా ను నిర్మించారు.
ఈ సినిమా ఒక అరుదైన గౌరవాన్ని అందుకోనుంది. చెన్నైలో నిర్వహించే పికె. రోజ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కాబోయే సినిమాల్లో ‘పలాస 1978’ కూడా ఎంపికైంది. ఈ నెల 9,10,11 న ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు.ఎస్సీ, ఎస్టీల జీవనాన్ని, వారి జీవిత గాథలను కథా చిత్రాలుగా మలిచే డైరెక్టర్ పా రంజిత్. ఆయన 2018లో వానమ్ ఆర్ట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు.
కరోనా తర్వాత మళ్లీ ఈ వేడుక జరగనుంది. ఏప్రిల్ నెలను ‘దళిత్ మంత్’గా జరుపుకుంటారు . ఏప్రిల్ 14న అంబేడ్కర్ పుట్టినరోజు పురస్కరించుకొని చేస్తున్న ఈ ఫెస్టివల్‌లో సాహిత్యం, సినిమా రెండు కూడా ప్రధాన భూమికలు పోషిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ రాజకీయాలను ఇతివృత్తంగా తెరకెక్కించిన సినిమాలను ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. ఇలాంటి ఒక గొప్ప వేదికపై తమ సినిమాను ప్రదర్శించడం సంతోషంగాను, గర్వంగానూ ఉందని కరుణ కుమార్ తెలిపారు.ఇక ఇదొక మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నారు.