దేవర.. ఎన్టీఆర్ జాగ్రత్తలు మాములుగా లేవు

రామ్ చరణ్‌తో పాటు “RRR” లో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న తరువాత, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ స్టార్ హీరో భారీ జాగ్రత్తలు తీసుకోవడానికి ఎ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. స్క్రిప్ట్ విషయంలో చాలాసార్లు చర్చలు జరిపి ఓకే చేయించాడు.

ఇక సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం కూడా జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకుంటున్నారు. తుఫాను మధ్య సముద్ర ఉపరితలంపై జరిగే ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సముద్రపు సెటప్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ క్రమంలో అనేక విన్యాసాలు అలాగే విజువల్ ఎఫెక్ట్‌లు ఉంటాయి.

ఇవి మొత్తం యాక్షన్ బ్లాక్‌ను ప్రభావితం చేయగలవు. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మొత్తం యాక్షన్ బ్లాక్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అందుకే ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ టీమ్ కంపోజ్ చేస్తున్న స్టంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ అవుట్ ఫుట్ పై తారక్ ఒక్కో డీటైల్‌ను జాగ్రత్తగా గమణిస్తున్నట్లు టాక్.

ఆచార్య విషయంలో కొరటాల విజువల్ ఎఫెక్ట్స్ పై జాగ్రత్తలు తీసుకోక పోవడం కొంత విమర్శలను కలిగించింది. ఇక ఇటీవల వచ్చిన ఆదిపురుష్ గ్రాఫిక్స్ పై కూడా ఆడియెన్స్ విమర్శలు చేశారు. అందుకే ఈసారి అలా కాకుండా దర్శకుడు ఓకే చెప్పినా కూడా చాలా జాగ్రత్తగా ఎన్టీఆర్ కూడా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. తారక్ ఓకే చెప్పిన తరువాతే ఫ్యాకప్ చెబుతున్నారట. అంటే దర్శకుడు కొరటాల అయినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఓకే చెప్పనిది షాట్ ఓకే కావడం లేదని తెలుస్తోంది.