సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే పెద్ద విషయం. అలా వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా వాడుకుంటూ తమ కెరీర్‌లను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇండస్ట్రీ కొత్తగా వచ్చిన సమయంలో కొన్ని విషయాల గురించి అంతగా తెలియదు. అప్పటికి అంతగా గుర్తింపు రాకపోవడంతో తమ మాట చెల్లదు. నో అని చెప్పడానికి వీలుండదు. అలా ఇష్టం లేకపోయినా కొన్ని సినిమాలను చేయాల్సి ఉంటుంది. అదే బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటీనటులు అయితే వారికి ఆ చాన్స్ ఉంటుంది.
అలా నివేదా పేతురాజ్‌కు కూడా కొన్ని ఘటనలు ఎదురయ్యాయట. కొత్తగా వచ్చిన హీరోయిన్లకు సాధారణంగా ఇలాంటి విషయాలు ఎదురువుతుంటాయి. పూర్తి కథ చెప్పరు.. వారు అడగరు.. పైగా కథ చెప్పేటప్పుడు ఒకలా ఉన్నా.. తీసేటప్పుడు వారికి అంత ప్రాధాన్యమున్న సీన్లు పడవు. ఇలా తమ పాత్రల గురించి ముందుగా చెప్పినట్టు ఉండవు. కాగితాలపై ఉన్న పాత్రలు, తెరపై వచ్చే సరికి పూర్తిగా మారిపోతుంటాయి. అలా నివేదా తన కెరీర్ మొదట్లో కథలు కూడా వినేది కాదట.
చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో కథేంటి? స్క్రిప్ట్‌లో నా పాత్రేంటి? అన్నది ఆలోచించకుండా దాదాపు ఎనిమిది చిత్రాలు చేశా. నేనలా చేసి ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత అర్థమైంది. తర్వాత కథలు, పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగేయడం నేర్చుకున్నా. మంచి నటనా ప్రాధాన్యమున్న పాత్రలు దక్కించుకో గలుగుతున్నానని చెప్పుకొచ్చింది. అలా నివేదాకు త్వరగానే జ్ఞానోదయమైందన్న మాట. నివేద ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్‌లో బిజీ హారోయిన్‌గా చెలామణి అవుతోంది. నివేదా నటించిన రామ్ RED సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.