సమ్మర్ సీజన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొననుంది. మే 9న నితిన్ నటించిన తమ్ముడు, రవితేజ మాస్ జాతర సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి రానున్నాయి. ఈ రెండు సినిమాలు భిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కుటుంబ అనుబంధాలతో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న తమ్ముడు చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, పూర్తిగా మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న మాస్ జాతర సినిమాను బాను బోగవరపు తెరకెక్కిస్తున్నారు.
నితిన్ గత కొన్ని సినిమాల్లో నిరాశ పరిచినప్పటికీ, ఈసారి విజయం సాధించేందుకు తన హిట్ కాంబినేషన్లను రిపీట్ చేస్తున్నాడు. భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో రాబిన్ హుడ్, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్‌తో తమ్ముడు సినిమాలు చేస్తున్నాడు. లయ అక్కగా రీ ఎంట్రీ ఇవ్వడం, కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమాకు భారీగా అంచనాలు పెరిగేలా చేశాయి.
మరోవైపు రవితేజ ధమాకా తర్వాత వరుస పరాజయాలతో ఉన్నప్పటికీ, మాస్ జాతర ద్వారా మళ్లీ తన మాస్ ఫ్యాన్‌బేస్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద గెలిచేది కంటెంట్ బలాన్ని బట్టి ఉంటుంది. తమ్ముడు కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంటే, మాస్ జాతర పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందింది. నిర్మాతగా దిల్ రాజు ఉన్నందున తమ్ముడు భారీ రీలీజ్ కావడంలో ఎటువంటి సమస్య ఉండదు. అయితే, రవితేజ కూడా ఫుల్ మాస్ అప్పీల్‌తో సక్సెస్ సాధించాలని భావిస్తున్నాడు. ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.