అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప -2’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మొదటిరోజు నుంచే సూపర్ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కొందరూ వ్యక్తులు వారి సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులను ‘పుష్ప -2’ సినిమాలోనివి అని ప్రచారం చేస్తున్నారు.
అయితే ఈ వార్తలపై తాజాగా నిర్మాణ సంస్థ స్పందిస్తూ.. ఇలాంటి పనులు చేస్తున్నవారికి వార్నింగ్ ఇచ్చింది. ”ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు ‘పుష్ప-2’ చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు చెయ్యటం మానుకోకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం” అంటూ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానేయండి అని సూచించింది.
