Natural Star Nani: నాని కొత్త ప్రయోగం.. 300 కోట్ల టార్గెట్ సాధ్యమేనా?

నేచురల్ స్టార్ నాని సినిమా ప్రమోషన్‌ విషయంలో ఎప్పుడూ కొత్తదనం చూపించే వ్యక్తి. ‘దసరా’తో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత, ఇప్పుడు ఆయన మళ్లీ అదే రేంజ్‌లో మరో మాస్‌ మూవీకి రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈసారి నాని సాధారణ టార్గెట్ పెట్టుకోవడం లేదు. ఆయన ఎలాంటి హిట్స్ చూసినా, ఎలాంటి మార్కెట్ పెంచినా, ఈసారి టార్గెట్ ఏకంగా 300 కోట్లు అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ గ్లింప్స్ ను మార్చి 3న విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయించారు. ఇదివరకటి నాని సినిమాల కంటే ఇది పూర్తిగా డిఫరెంట్‌ కానుందని తెలుస్తోంది. ప్రధానంగా ఈ సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, స్పానిష్ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే, స్పెయిన్‌లో ప్రత్యేకంగా విడుదల అవుతున్న తొలి తెలుగు సినిమా ఇదే. అంతేకాదు, స్వయంగా నాని స్పానిష్‌ భాషలో డబ్బింగ్‌ చెప్పనున్నట్లు సమాచారం.

నాని ఈ ప్రయోగాన్ని ఎందుకు చేస్తున్నాడంటే, తెలుగులో ఇప్పటికే తన మార్కెట్‌ పక్కాగా ఉందనే నమ్మకం. ఇప్పుడు కొత్త భాషల్లోనూ, కొత్త దేశాల్లోనూ తన మార్కెట్ విస్తరించాలని చూస్తున్నాడు. ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్ల సమయంలో కూడా నాని ఇతర భాషల్లో తెలుగు సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వ్యక్తపరిచాడు. ఇప్పుడు అదే ‘ది ప్యారడైజ్‌’ ద్వారా చేసి చూపించాలని నిర్ణయించుకున్నాడు. ప్రత్యేకంగా స్పానిష్‌ మార్కెట్‌లో టార్గెట్‌ పెట్టుకోవడం వల్ల ఈ సినిమాకు గ్లోబల్‌ రీచ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

‘దసరా’తో నాని తన కెరీర్‌లో మొదటి సారి 100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్‌’ను అంతకంటే భారీగా ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రధానంగా హిందీ మార్కెట్‌ కోసం ప్రత్యేక ప్రమోషన్లు చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ‘దేవర’, ‘పుష్ప 2’ సినిమాలు నార్త్ బెల్ట్‌లో క్రేజ్ పెంచిన నేపథ్యంలో, నాని కూడా అక్కడ తన మార్కెట్‌ను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హిందీలో ఈ సినిమాతో కనీసం 70-100 కోట్ల టార్గెట్‌ పెట్టుకున్నట్లు ట్రేడ్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇక ఫైనల్‌గా, వరల్డ్‌ వైడ్‌ 300 కోట్ల బాక్సాఫీస్‌ టార్గెట్‌ను ఫిక్స్‌ చేసుకున్నట్లు సమాచారం. ఈ స్థాయిలో నాని మూవీ వసూళ్లు రాబట్టగలదా? ఆయన క్రేజ్‌ ఈ రేంజ్‌లో హిట్‌ అవుతుందా? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. ప్రస్తుతానికి ‘ది ప్యారడైజ్‌’ సూపర్‌ ఇంటెన్స్‌ కానుందని, సినిమాలో నాని పాత్ర పూర్తిగా డిఫరెంట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. రా స్టేట్‌మెంట్ పేరుతో విడుదల కాబోతున్న గ్లింప్స్‌ ఈ సినిమా టోన్‌ను ఏ స్థాయిలో నిలబెడతాయో చూడాలి.

Public Reaction On Pawan Kalyan Comments Over Ys Jagan Walkout from Assembly || Ap Public Talk || TR