ముగ్గురు మిత్రుల కథే నాగ్‌ ‘నా సామిరంగ’

చాలా విరామం తర్వాత నేను నటించిన మాస్‌ సినిమా ఇది. నా గత చిత్రాలతో పోల్చితే యాక్షన్‌ ఘట్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంక్రాంతి సీజన్‌లో పర్‌ఫెక్ట్‌ మూవీ అని చెప్పొచ్చు’ అన్నారు అగ్ర హీరో నాగార్జున. ఆయన నటించిన తాజా చిత్రం ’నా సామిరంగ’. విజయ్‌ బిన్నీ దర్శకుడు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నాగార్జున పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్నారు.

కేవలం 35 రోజుల్లోనే పూర్తయిన నా చిత్రాలు చాలానే ఉన్నాయి. ’నా సామిరంగ’ 72 రోజులు పాటు షూటింగ్‌ జరుపుకుంది. నేను అరవై రోజుల పాటు పనిచేశాను. అయితే షూటింగ్‌ డేట్‌ మొదలుకొని రిలీజ్‌ డేట్‌ వరకు పక్కా ప్రణాళికతో వేగంగా పూర్తి చేసిన సినిమా మాత్రం ఇదే. మలయాళ మూల కథకు తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించాం. ముగ్గురు మిత్రుల స్నేహబంధం చుట్టూ కథ నడుస్తుంది.

ఇందులో ప్రేమ, త్యాగం, నమ్మకం..ఇలా అన్ని అంశాలుంటాయి. హృదయాన్ని కదిలించే ఎమోషన్స్‌తో కూడిన అద్భుతమైన కథ అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ.. ఈ మూడు రోజుల్లో జరిగే కథ ఇది. 1980 నేపథ్యంలో నడుస్తుంది. తెరపై సంక్రాంతి పండగను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. కథాంశం తగినట్లు సంక్రాంతి రోజున విడుదల కావడం ఆనందంగా ఉంది. సినిమాలో నా పాత్ర పేరు కిష్టయ్య. అతను స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్తాడు.

హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌తో నాకో ప్రేమకథ కూడా ఉంటుంది. దర్శకుడు విజయ్‌ బిన్నీ కొరియోగ్రాఫర్‌ కావడం వల్ల పాటలోనే కథను చెప్పే మంచి నేర్పు ఉంది. ఆయనలోని ఈ ప్రతిభ నచ్చే దర్శకుడిగా అవకాశమిచ్చాను. నా స్నేహితులుగా అల్లరి నరేష్‌, రాజ్‌తరుణ్‌ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ కనబరిచారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఈ నెలాఖరులో షూటింగ్‌ మొదలవుతుంది. ఆ తర్వాత కొత్త దర్శకుడితో యాక్షన్‌ సినిమా చేయబోతున్నా. ’పఠాన్‌’ తరహాలో సాగే డిఫరెంట్‌ యాక్షన్‌ జోనర్‌ చిత్రమిది.