Motorola Foldable Phone: పర్సులా కనిపించే మోటరోలా ఫోల్డబుల్ ఫోన్.. భారత మార్కెట్లోకి ఎంట్రీ!

ప్రముఖ టెక్ బ్రాండ్ మోటరోలా తన నూతన ఫోల్డబుల్ మోడల్ మోటరోలా రేజర్ 60ను భారత్‌లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మే 28న మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయానికి రానున్న ఈ ఫోన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన రంగులు, కొత్త జనరేషన్ ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

భారత మార్కెట్లో రేజర్ 60 మూడు ప్రత్యేక రంగుల్లో లభించనుంది: పాంటోన్ జిబ్రాల్టర్ సీ, స్ప్రింగ్ బడ్, లైటెస్ట్ స్కై. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌తో ఇది అందుబాటులో ఉండనుంది. అంతర్జాతీయ వెర్షన్‌లో 16GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్లు కూడా ఉన్నాయి. డిజైన్ పరంగా ఫోన్ పూర్తిగా ఫోల్డబుల్ పర్స్ లుక్‌తో ఉండటం ప్రత్యేకత. Android 15పై రన్ అవుతున్న ఈ ఫోన్‌కు మూడు OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు హామీగా ఉంటాయి.

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో 6.96 అంగుళాల LTPO P-OLED ఫుల్ హెచ్‌డీ+ ప్రధాన డిస్‌ప్లే, 3.63 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7400X ప్రాసెసర్‌తో శక్తివంతంగా పని చేస్తుంది. కెమెరా సెటప్‌లో 50MP + 13MP డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4,500mAh బ్యాటరీ, 30W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ మిడ్ రేంజ్ ఫోల్డబుల్ విభాగంలో పోటీ పడనుంది. ఇండియాలో దీని ధర రూ.60,000 పరిధిలో ఉండొచ్చని అంచనా.