గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్తను యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. మహమ్మారి కరోనా సోకడం, దాంతో పోరాడి జయించిన బాలు ఇతర సమస్యలతో నిన్న (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తనువుచాలించారు. ఇక ఎస్పీబీ మరణించడంతో సినీ ప్రముఖులంతా కన్నీరు మున్నీరయ్యారు. తమిళ, తెలుగు హిందీ ఇలా సినీ ప్రముఖులందరూ బాలుకి నివాళులు అర్పించారు.
ఈ క్రమంలో మోహన్ బాబు బాలుతో ఉన్న పరిచయం గురించి, అనుబంధం గురించి చెబుతూ సుధీర్ఘ పోస్ట్ చేశాడు. ఇండస్ట్రీకి రాక ముందు కాలేజీలో ఉన్న రోజుల్లో పరిచయమని తెలిపాడు. ఇద్దరం సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు నేను హీరోగా, ఆయన సింగర్‌గా కెరీర్ ప్రారంభించామని తెలిపాడు. తాను మొదటగా.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టానని ఆనాడు తనవద్ద డబ్బులు లేవని చెబుతూ ఓ సంఘటనను వివరించాడు.
తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే కాలంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నానని తెలిపాడు. అప్పుడు బాల సుబ్రహ్మణ్యం దగ్గరకు వెళ్లి వంద రూపాయలు అడిగి తీసుకున్నానని గుర్తు చేసుకున్నాడు. మేం కలుసుకున్నప్పుడల్లా ఇప్పటికీ ఆ వంద రూపాయల విషయం ప్రస్థావించి.. ‘వడ్డీతో కలిసి ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా! వడ్డీతో సహా నా డబ్బులు నాకు ఇచ్చేయ్’ అని బాలు గారు సరదాగా ఆటపట్టించే వారట ఈ మేరకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యాడు.