యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన ఐటీ ఉద్యోగి ఒక్కసారిగా కోట్లాదిరూపాయల యజమాని అయ్యారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ లాటరీలో పాల్గొన్న వేణుగోపాల్ ముల్లచ్చేరి అనే వ్యక్తికి 1 మిలియన్ డాలర్ల జాక్‌పాట్ తగిలింది. గత 15 సంవత్సరాలుగా లాటరీ టికెట్లు కొనుగొంటూ వచ్చిన ఆయనకు చివరకు అదృష్టం తలుపు తట్టింది.
అజ్మాన్‌లో నివసిస్తున్న వేణుగోపాల్, వృత్తిరీత్యా ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్. ఇటీవలే భారతదేశంలో కుటుంబాన్ని కలిసేందుకు వచ్చి తిరిగి వెళ్లే సమయంలో దుబాయ్ విమానాశ్రయంలో లాటరీ టికెట్ కొనుగొన్నారు. ఏప్రిల్ 23న జరిగిన డ్రాలో ఆయన టికెట్‌కు భారీ గెలుపు దక్కింది. ఈ గెలుపుతో వేణుగోపాల్, మిలీనియం మిలియనీర్ డ్రాలో 500వ విజేతగా నమోదయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభాలను గుర్తు చేసుకున్నారు. కొత్తగా నిర్మించిన ఇంటికి అప్పులు రావడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం వంటి అనేక సమస్యలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని తెలిపారు. అచ్చం అప్పుడే ఇలా జాక్‌పాట్ దక్కడం తనకు రెండో జన్మ వచ్చినట్లుగా ఉందన్నారు.
ఇప్పటివరకు తీసుకున్న అప్పులన్నీ తొలుత తీర్చాలని నిర్ణయించుకున్న వేణుగోపాల్, ఆ తర్వాత కుటుంబంతో కలిసి మంచి విహారయాత్ర ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. కొంతకాలం విశ్రాంతి తీసుకుని వ్యాపారం ప్రారంభించాలని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకురావాలని ఆశిస్తున్నారు. “ఇది నిజంగా దేవుడిచ్చిన వరం. ఎన్నో సంవత్సరాలుగా నేను చూసిన కల నేడు నెరవేరింది. ఇది కేవలం డబ్బు గెలుపు కాదు, జీవితంపై నమ్మకం మళ్లీ తిరిగి వచ్చింది,” అని వేణుగోపాల్ హర్షాతిరేకంగా పేర్కొన్నారు.