మెహబూబ్‌కి స్టేజ్‌పైనే 10 లక్షల చెక్ రాసిచ్చిన మెగాస్టార్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాను మెగాస్టార్ ను మాత్రమే కాదని, మనసున్న స్టార్ ని అని కూడా చిరంజీవి మరోసారి నిరూపించారు. బిగ్ బాస్ రియాల్టీ షో నాలుగో సీజన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి స్టేజ్ పై తన దాతృత్వాన్ని ప్రదర్శించారు.తనకు సొహైల్ ఇవ్వజూపిన రూ.5 లక్షలను మెహబూబ్ అనాథలకు ఇవ్వాలనుకున్నాడని నాగార్జున మెగాస్టార్ కి చెప్పడంతో చిరంజీవి వెంటనే స్పందించారు.

ఈ షో ద్వారా సంపాదించిన సొమ్మును మీరు మీ కోసం ఉపయోగించుకోండి… మెహబూబ్ కు నేను ఇస్తున్నాను రూ.10 లక్షలు అంటూ అప్పటికప్పుడు స్పాట్ లో 10 లక్షల చెక్ రాసి ఇచ్చేశారు. ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమైన మెహబూబ్ చిరంజీవికి పాదాభివందనం చేశాడు. మెహబూబ్ ను చిరంజీవి తన గుండెలకు హత్తుకుని ఊరడించారు. ఇక మరో కంటెస్టెంట్ దివితో చిరు మాట్లాడుతూ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర ఇస్తున్నట్టు చెప్పారు.

దాంతో దివి ఎగిరి గంతేసింది. బిగ్ బాస్ ఇంట్లో దివి పెర్ఫార్మెన్స్ చూశాక దర్శకుడు మెహర్ రమేశ్ ను అడిగి ఓ ప్రత్యేక పాత్రను రూపొందించామని చిరంజీవి వెల్లడించారు.మెహబాబ్‌ని ఓదార్చుతూ.. మీరు కళాకారులయ్యా.. కళాకారులు కన్నీళ్లు పెట్టకూడదు అంటూ గుండెల్ని హత్తుకునే మాటలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో జై మెగాస్టార్ అంటూ బిగ్ బాస్ స్టేజ్ మొత్తం దద్దరిల్లింది.