Kalyaan Dev: విజేత సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు, మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్.. రెండో ప్రయత్నంగా చేసిన సూపర్ మచ్చీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పులి వాసు ఈ సినిమాను తెరకెక్కించగా , హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా అభిమానులను ఆకట్టుకుంది.
ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో వివాహం జరిగిన కొన్నాళ్ల పాటు బాగానే ఉన్న వీరిద్దరూ, గత కొంత కాలం నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా తెగ ప్రచారం జరుగుతోంది. శ్రీజ కూడా తన ఇన్‌స్టా అకౌంట్‌లో తన పేరును మార్చడంతో అది నిజమేననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో వారు ఎక్కడికెళ్లినా ఒంటరిగానే వెళ్లడం, లేదా ఫొటోలను షేర్ చేసినపుడు కూడా ఎవరికి వారన్నట్టు ప్రవర్తించడం అందరికీ పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
అయితే సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే వీరిద్దరూ కూడా ఈ విషయంపై ఏ రకంగానూ స్పందించకపోవడం గమనార్హం. అంతే యాక్టివ్‌గా తన వెకేషన్, తదితర పోస్టులు చేస్తూ ఈ మధ్య కాలంలో సంచలనంగా మారాడు హీరో కళ్యాణ్ దేవ్. ఇటీవలి కాలంలో అతని గురించి ఏ చిన్న వార్త వచ్చినా వైరల్ అవుతుండడం విశేషం. కాగా తాజాగా ఆయన హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నట్టుగా రంగులతో తడిసిపోయిన తన ఫొటోను షేర్ చేస్తూ, ఈ హోలీ పండగ రోజున ప్రేమ, సరదాలను పంచండంటూ క్యాప్షన్‌ను జత చేస్తూ చేసిన ఓ పోస్ట్ అందర్నీ ఆకర్షిస్తోంది. అంతే కాకుండా తన కూతుళ్లు నివృత్తి, నవిష్క సరదాగా సెలబ్రెట్ చేసుకున్న హోలీ వీడియోలను కూడా ఆయన తన ఇన్‌స్టా పేజీలో స్టోరీగా పెడుతూ రంగుల్లో మునిగిపోయారంటూ కామెంట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. కానీ చెప్పాల్సిన విషయమేమిటంటే ఇవన్నింటిలో ఎక్కడా కూడా శ్రీజ కనిపించలేదు. ఇకపోతే కళ్యాణ్ దేవ్ సినిమాల విషయానికొస్తే ఆయన ప్రధాన పాత్రలో నటించిన కిన్నెరసాని చిత్రం త్వరలో విడుదల కానున్నట్టు సమాచారం.