సంక్రాంతికి సినిమాల తాకిడి ఎక్కువ కావడంతో అసలు కొన్ని సినిమాలు నిజంగానే ఆ సమయానికి విడుదల అవుతాయా లేదా అనే అనుమానాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇక కొన్ని సినిమాల షూటింగ్స్ అయితే ఇంకా పూర్తి కాలేదు. ఆ పనులు కూడా సంక్రాంతి లోపు ఫినిష్ అవుతాయా లేదా అనే క్లారిటీ కూడా లేదు.
సంక్రాంతి సీజన్ ను వదులు కోవడానికి మేకర్స్ వెనుకడుగు వేయడం లేదు. సంక్రాంతి సినిమాలలో ముందుగా షూటింగ్ ఫినిష్ చేసుకున్న సినిమాలలో సైంధవ్, ఈగల్, హనుమాన్ ఉన్నాయి. ఈ మూడు సినిమాలు అసలు పోటీ నుంచి తప్పుకోవడానికి ఏ మాత్రం ఇష్ట పడడం లేదు. ఇక గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్ సినిమాలు షూటింగ్ బ్యాలెన్స్ ఎక్కువగానే ఉంది. గుంటూరు కారం అయితే డిసెంబర్ సెకండ్ వీక్ నాటికి షూటింగ్ పూర్తి చేసుకునే విధంగా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇక వేగంగా షూటింగ్ ఫినిష్ చేసుకుంటున్న సినిమాలలో నాగార్జున ‘నా సామి రంగా’ మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకొని రిలీజ్ అవుతోంది. నాగార్జున సంక్రాంతి టైమ్ లో సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు లాంటి సక్సెస్ లను అందుకున్నాడు. బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న నా సామి రంగా పూర్తిగా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది. ఇక జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఇక డిసెంబర్ అయిదుకు నాలుగు పాటలు మినహా మిగిలిన సినిమా అంతా పూర్తి అయ్యే విధంగా దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈమధ్య కాలంలో ఏ సినిమా షూటింగ్ కూడా ఈ స్పీడ్ లో కొనసాగ లేదని చెప్పవచ్చు. ఇక సంక్రాంతి ఫెస్టివల్ లో ఈ సినిమాకు మాస్ కంటెంట్ తో పోటీగా కేవలం గుంటూరు కారం మాత్రమే ఉంది. మిగతా సినిమాల కంటెంట్ కాస్త భిన్నంగా ఉన్నాయి. ఇక నా సామి రంగా తప్పకుండా సంక్రాంతి టైమ్ లో క్లిక్ అవుతుందని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు.