మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న వివాదాలు మరింత తీవ్రంగా మారాయి. మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుపై, తన కుటుంబంపై వివాదాస్పద ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మనోజ్, తనపై దాడి జరిగిందని, ఇది ఆస్తి సంబంధిత వివాదాల కారణమని ఆరోపించారు.
ఇక తన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా, మోహన్ బాబు రాచకొండ సీపీకి లేఖ రాశారు. తన కొడుకు మనోజ్‌తో పాటు కోడలు మౌనిక నుంచి ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో, ఈ ఆరోపణలపై మనోజ్ స్పందిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కావాలనే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.
తన భార్య మౌనికతో కలిసి స్వతంత్రంగా జీవిస్తున్నానని, కుటుంబ ఆస్తులపై తాను ఎప్పుడూ ఆధారపడలేదని మనోజ్ స్పష్టం చేశారు. తన ఏడు నెలల చిన్నారిని కూడా వివాదంలో లాగడం అమానవీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి, సోదరుడు విష్ణు కలిసి మోహన్ బాబు యూనివర్సిటీ తరహాలో అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని మనోజ్ తెలిపారు.
ఇక ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ మాయమైందని, దీనిపై అనుమానాలు వ్యక్తం చేసిన మనోజ్, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నిజాన్ని వెలికితీయాలని కోరారు. తన తండ్రితో కలిసి సమస్యలను సఖ్యతతో పరిష్కరించాలనుకున్నప్పటికీ, మోహన్ బాబు తన వినతిని పట్టించుకోలేదని మనోజ్ వాపోయారు.
తన జీవితాన్ని స్వయంగా నిర్మించుకుంటున్నానని, తన వ్యక్తిగత ప్రతిభతోనే ఆత్మగౌరవంతో జీవిస్తున్నానని మనోజ్ తెలిపారు. కుటుంబ సమస్యలను ఓ కొలిక్కి తీసుకురావాలన్న ఆశతో తన ప్రయత్నాలు విఫలమయ్యాయని, అయినప్పటికీ నిజాయతీతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.