మహేష్.. ఆ దర్శకులతో మళ్ళీ చేస్తాడా?

వంశీ పైడిపల్లికి- మహేశ్ బాబు.. అనిల్ రావిపూడి- మహేశ్ బాబు… ఈ కాంబోలో వచ్చిన మహర్షి- సరిలేరు నీకెవ్వరూ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచి మంచి వసూళ్లను అందుకున్నాయి. మహేష్ ను చిత్ర సీమలో ఇంకో మెట్టు ఎక్కించాయి. ఈ కాంబోలో మరో సినిమా వస్తే చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగానే ఉన్నారు. దీంతో తనకు హిట్ ఇచ్చిన వీరిద్దరితో మరో సినిమా చేస్తానని మహేష్ కమిట్మెంట్ కూడా అయ్యాడు. కానీ ఇప్పుడు వీరిద్దరికి.. మహేశ్ షాక్ ఇచ్చే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలే ఈ కథనం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. రాజకుమారుడులా ఎంట్రీ ఇచ్చి.. మురారిలా మురిపించి.. ఒక్కడుగానే బాక్సాఫీస్ ను షేక్ చేసిన పోకిరి. ఎలాంటి కథైనా ఖలేజా చూపుతూ.. తెలుగు సినిమాకు పక్కా బిజినెస్ మెన్ లా సరికొత్త మార్కెట్ ను ఓపెన్ చేసిన ఓవర్సీస్ స్టార్ అతడు. జయాజయాలతో సంబంధం లేకుండా.. సైనికుడులా కష్టపడుతూ.. అవకాశాన్ని దూకుడు చూపుతూ.. శ్రీమంతుడైనా మహర్షిలా పక్కవారికి సాయం చేస్తూ.. సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న ఒన్ అండ్ ఓన్లీ ఆయన. ఈ రైమింగ్ చూస్తేనే అర్థమైంది కదా ఇవి మహేశ్ బాబు సినీ జర్నీ. రీసెంట్ గా సర్కారు వారి పాట తో బాక్సాఫీస్ హిట్ కొట్టారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఇవన్నీ చిత్రాలు మనం గమనించినట్లయితే సినిమా సినిమాకు మహేశ్ రేంజ్, క్రేజ్, బిజినెస్ పెరుగుతూ పోయింది. వెనక్కి మాత్రం తగ్గలేదు. అయితే త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ చేయబోయే సినిమా దర్శక ధీరుడు రాజమౌళితో. అసలే రాజమౌళి సినిమా అంటే తెలిసిన విషయమే కదా.

ఆయనతో ఏ హీరో సినిమా చేసిన వారి స్టార్ డం ఇండియా వైడ్ గా పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ పెరిగిపోతుంది. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ చిత్రాలను గమనిస్తే అందులో నటించిన ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా పెరిగింది. ఈ చిత్రాల తర్వాత ఈ హీరోలతో సినిమాలు చేసేందుకు ఇండియా వైడ్ టాప్ దర్శకులంతా క్యూ కడుతున్నారు. వీరి చిత్రాలు భారీ బడ్జెట్ తోనే రూపొందుతున్నాయి.

మరి ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు కదా. అంటే మహేష్ రాజమౌళి సినిమా విడుదలయ్యాక.. మహేష్ రేంజ్ ఏ స్థాయికి వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆయన క్రేజ్ కూడా ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ గా పెరిగిపోతుంది. అంటే ఆయనతో కూడా సినిమాలు చేసేందుకు ఇండియా వైడ్ గా ఉన్న బడా దర్శకులంతా క్యూ కడతారు. ఇక మహేశ్ కూడా భారీ ప్రాజెక్టులనే ఓకే చేయొచ్చు. భిన్న కథలనే చేసేందుకు ఆసక్తి చూపించొచ్చు.

మరి ఇలాంటి సమయంలో వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి తమ మార్క్, రొటీన్ కథలతో వస్తే మహేశ్ ఒప్పుకుంటారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా భిన్న కథలతోనే వస్తేనే వారితో మహేశ్ సినిమా చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ కాంబోలో రిపీట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.