‘గుంటూరు కారం’లో మహేశ్‌ బాబు ఎమోషనల్‌

మహేష్‌ బాబు , త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌ వేడుక గుంటూరులో జరిన సందర్భంగా నటుడు మహేశ్‌ బాబు ఎమోషనల్‌ అయ్యారు. తన తండ్రి కృష్ణ ఉండివుంటే సినిమా మంచిచెడుతు చెప్పేవారని..ఇప్పుడు ఆయన లేనందున విూరే ఇక అంతా చూసుకోవాలని అంటూ అబిమానులను వేడుకున్నారు. ఈ వేడుకకు వేలాదిమంది మహేష్‌ బాబు అభిమానులు తరలివచ్చి ఈ వేడుకని జయప్రదం చేశారు. ఇదే వేడుకలో మహేష్‌ బాబు చాలా భావోద్వేగానికి కూడా గురయ్యారు.

ఈ ’గుంటూరు కారం’ సినిమా మొదలుపెట్టిన తరువాత మహేష్‌ బాబు తన తండ్రి అయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ గారిని పోగొట్టుకున్నారు. అంతకు ముందు తల్లి ఇందిరాదేవిని కూడా పోగొట్టుకున్నారు. ఇలా తల్లిదండ్రులను ఒకే ఏడాది పోగొట్టుకొని వున్న బాధలో ఈ ’గుంటూరు కారం’ సినిమా షూటింగ్‌ చేశారు.మధ్యలో కూడా ఎన్నో అవాంతరాలు, ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు వచ్చినా సినిమా షూటింగ్‌ మాత్రం ఆగకుండా, జనవరి 12న విడుదల చేస్తున్నాం అని ఆ తేదీకే అనుకొని నిరంతరం పని చేశారు.

ముందు పూజ హెగ్డే అనుకున్నారు, ఆమె తప్పుకుంది, ఆమెకి బదులుగా శ్రీలీల వచ్చింది, తరువాత విూనాక్షి చౌదరి కూడా ఇందులో రెండో కథానాయికగా చేసింది. సినిమాటోగ్రఫర్‌ మధ్యలో తప్పుకున్నాడు, వేరే అతను వచ్చాడు, అయినా సినిమా అనుకున్నట్టుగానే పూర్తి చేసి అనుకున్న తేదీకి విడుదల చేస్తున్నారు. ’గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాదులో జరగాల్సి వుండిరది, కానీ ఇక్కడ అనుమతి దొరకలేదు, ఏమి చెయ్యాలా అని అలోచించి గుంటూరు పట్టణంలో చేద్దామని అక్కడ అనుమతి తీసుకున్నారు.

ఈ వేడుకకి వచ్చిన అభిమానుల సందోహాన్ని చూసి మహేష్‌ బాబు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ’నాన్నగారు ఉంటే అతని ఫోన్‌ కాల్‌ కోసం ఎదురు చూసేవాడిని. అతను సినిమా ఎలా వుంది కలెక్షన్స్‌ అన్నీ చెప్పేవారు, ఇప్పుడు నాన్నగారు లేరు, నాకు అమ్మయినా, నాన్నయినా అన్నీ విూరే! విూరే నాకు సినిమా ఎలా వుందో చెప్పాలి,’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.