తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడడం ఖాయం అన్న చర్చ సాగుతోంది. ఐదారు నెలలుగా థియేటర్లు తెరిచి సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి నెలకొనడంతో ఇది కాస్తా ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్ల వరకూ ఇతర ఆదాయ మార్గాల వల్ల కొంతకాలం నిలదొక్కుకున్నా.. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రం కళ్యాణ మంటపాలు.. గొడౌన్లుగా మారతాయని విశ్లేషిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఓటీటీ – డిజిటల్ బలంగా పాతుకుపోతున్న క్రమంలో థియేటర్ రంగం కుప్పకూలిపోవడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. అయితే దీనిపై సినీవర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పటికి కరోనా వల్ల భయపడినా తర్వాత పరిస్థితులు సర్ధుకుంటే తిరిగి యథాతథంగా జనం థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు.. చిరంజీవి సహా పలువురు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మహమ్మారీ ఉధృతి తగ్గి వ్యాక్సినో టీకానో వస్తే అందరికీ భరోసా వస్తుందని అందుకు ఎంతో సమయం పట్టదని ఆశిస్తున్నామని వీరంతా అన్నారు. ఇప్పుడు అదే విధంగా కొరటాల శివ కూడా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అభిప్రాయం వ్యక్తపరిచారు. జనం థియేటర్లకు వచ్చి సినిమా చూడడాన్ని ఎంతో ఎగ్జయిటింగ్ గా ఫీలవుతారని అది యూనిక్ ఎక్స్ పీరియెన్స్ లా ఉంటుందని అన్నారు. త్వరలోనే థియేటర్లు తెరుచుకోవచ్చు. ఈ మూడు నాలుగు నెలలు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత సర్ధుకుంటుంది! అంటూ అభిప్రాయపడ్డారు. చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో ఆచార్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది కాపీ కథ అంటూ ఓ దర్శకరచయిత ఆరోపించడం హాట్ టాపిగ్గా మారింది.