“నా గురించి ఎవరైనా మంచి విషయాలు చెప్పినప్పుడు, ప్రోత్సాహకరమైన మెసేజ్‌లు పెట్టినప్పుడు థ్రిల్లై పోతాను. అవి నా ఎనర్జీని రెట్టింపు చేస్తాయి. విమర్శను సీరియస్‌గా తీసుకోను. అయినప్పటికీ నేను ఇబ్బందిపడేంత విమర్శను ఇప్పటి వరకైతే ఎదుర్కోలేదు.అయితే తరచుగా చివరి నిమిషంలో నిర్ణయాల్ని మార్చుకుంటాను. అదే నా బలహీనత అని నా స్నేహితులంతా అంటుంటారు. ఆ ఒక్క విషయంలో నన్ను నేను మార్చుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నా” అంటోంది బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాణీ.
తను నటించిన చిత్రం ‘లస్ట్ స్టోరీస్’ ఆమె కెరీర్‌కు టర్నింగ్‌పాయింట్‌గా నిలిచిందిట. ఆ సినిమా తర్వాతే నటిగా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలననే నమ్మకం దర్శకుల్లో కలిగిందిట. ‘లస్ట్ స్టోరీస్’ ప్రశంసలను తెచ్చిపెడితే, ‘కబీర్‌సింగ్’ ప్రేక్షకుల ప్రేమను పంచింది. కెరీర్ తొలినాళ్లలో కియారా అదృష్టాన్ని ఎక్కువగా నమ్మేది. కానీ “కష్టపడేతత్వమే ప్రతిభకు తార్కాణమని.. మాటలు కాదు, మనం చేసే పని మాట్లాడాలి” అని సల్మాన్‌ఖాన్ ఇచ్చిన సలహాతో నటనను మెరుగుపరుచుకోవడంపై దృష్టిపెట్టిందట కియారా అద్వాణీ.
“అత్యుత్తమ ప్రతిభను కనబరచడానికి అభద్రతాభావం, పోటీతత్వం దోహదపడతాయి. నాకు తెలిసి ప్రతి ఒక్క యాక్టర్‌కి ఇన్‌సెక్యురిటీ ఫీలింగ్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే.. అదీ మంచిదే ! భయం బాధ్యతను నేర్పుతుంది. బలంగా, మెరుగ్గా తయారవ్వడానికి ఉపకరిస్తుంది” అని అంటోంది ఈ బాలీవుడ్ భామ.
ఇంతకీ పెళ్లెప్పుడో? అని ప్రశ్నిస్తే.. ” మనసులో ఏదీ దాచుకోకుండా సూటిగా మాట్లాడే వాళ్లు, నిజాయితీగా ఉండేవాళ్లు, ఇతరుల పట్ల దయగా ఉండేవాళ్లు, స్వయంకృషితో పైకి వచ్చిన వాళ్లు అంటే ఇష్టం. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ, తప్పొప్పుల్ని సమంగా స్వీకరించే గుణం ఉన్న వ్యక్తి జీవితభాగస్వామిగా రావాలని కోరుకుంటున్నా. నా జీవితంలోకి వచ్చే వ్యక్తి నిజాయితీ కలిగి ఉంటూ.. ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉండాలి. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కోసమే ఎదురుచూస్తున్నా” అని చెప్పింది.