హీరోయిన్‌గా కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో లేని పోని రిస్క్‌లు చేస్తే అసలుకే మోసం వస్తుందని మనందరికి తెలిసిందే. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. తాజాగా మహానటి చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ నుండి టర్న్ తీసుకొని చెల్లెలిగా నటించేందుకు సిద్ధమైందట. స్టార్ హీరోల సరసన కథానాయికగా ఆఫర్స్ వస్తున్న ఈ సమయంలో చెల్లెలు పాత్రలు చేస్తే మొదటికే మోసం వస్తుందంటున్నారు ఆమె అభిమానులు.
మేటర్‌లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమా చేస్తుండగా, ఈ మూవీకి కరోనా తాత్కాలిక బ్రేక్ వేసింది. కరోనా ఉదృతి కాస్త తగ్గుతున్న క్రమంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి తమిళంలో అజిత్ హీరోగా సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు చిరు. ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పడుతున్న ఈయన వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.
వేదాళం రీమేక్‌లో చెల్లెలి పాత్ర చాలా కీలకం కాగా, ఈ పాత్ర కోసం ముందుగా సాయి పల్లవిని తీసుకోవాలని భావించారు. కాని ఈ మలయాళ బ్యూటీ ఆసక్తి చూపని కారణంగా కీర్తి సురేష్‌ని సంప్రదించారట. చిరు చెల్లెలు అనగానే కీర్తి సురేష్ కూడా ఆసక్తి మరింత కనబరిచిందట. వెండితెరపై అన్నాచెల్లుళ్లుగా చిరంజీవి, కీర్తి సురేష్ ఎలా కనిపిస్తారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. కాకపోతే కీర్తి కెరియర్‌కు ఇది కొంత రిస్క్ అని అంటున్నారు ఫ్యాన్స్ . కాగా, ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళంలో శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదాళం’ రీమేక్ హక్కులను కె.ఎస్.రామారావు ఎప్పుడో కొనుగోలు చేశారు. ఇప్పుడు సమయం రావడంతో సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సన్నద్దమవుతున్నారు.