తెలుగు రాష్ట్రాలలో సినిమా ధియేటర్లలో దాదాపుగా 90 శాతం ఇండస్ట్రీలోని నలుగురు చేతిలో మాత్రమే ఉన్నాయంటూ, వారి గుత్తాధిపత్యంలో ఇండస్ట్రీ నలిగిపోతుందంటూ ఇప్పటికే అనేక సార్లు అనేక మంది విమర్శించారు. ఆ నలుగురిలో దిల్ రాజు పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అయితే.. దానిని నిజం చేస్తూ దిల్ రాజుపై తెలంగాణలో మరో పంపిణీదారుడు కార్తికేయ డిస్ట్రిబ్యూటర్స్ వరంగల్ శ్రీను ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం సంచలనం రేపుతోంది. ‘ఆయన దిల్ రాజు కాదు.. కిల్ రాజు… తెలుగు సినిమాలను కిల్ చేస్తున్నాడు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దిల్ రాజు చేతిలోనే నిజాం, వైజాగ్ ఏరియాల్లో చాలా వరకు థియేటర్లు ఉన్నాయి. దీంతో తను రిలీజ్ చేసే సినిమాలకే ఎక్కువ థియేటర్స్ దక్కుతాయి. క్రాక్ సినిమాను నిజాం ఏరియాలో వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాడు. సినిమా తీసుకునే ముందు మూడు రోజుల పాటు దిల్ రాజు, శిరీష్ లతో మాట్లాడి, వారు సరిపడా థియేటర్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నాకే క్రాక్ తీసుకున్నట్లు తెలిపాడు. ఆ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్న సమయంలో తనకు థియేటర్లు లేకుండా చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
దిల్ రాజు, శిరీష్ తనకు ఎక్కువ ధియేటర్లు కేటాయస్తానని మాట ఇచ్చి ఇప్పుడు తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం దిల్ రాజు.. తెలుగు సినిమాలకు కాకుండా తమిళ సినిమాలకు ధియేటర్లు ఎలా కేటాయిస్తాం అంటూ ప్రకటించారని.. మరి ఇప్పుడు మాస్టర్ కు ఎలా ధియేటర్లు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇన్నాళ్లు ఓపిక పట్టామని.. అది నశించే ఈరోజు బయటకు రావాల్సి వచ్చామన్నారు. దిల్ రాజు కూడా ఓ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే.. అంతకంటే ఎక్కువేం కాదన్నారు. సినిమాల కంటే ఇకపై దిల్ రాజుపైనే తన ఫోకస్ ఉంటుందని అంటున్నారు. దీంతో టాలీవుడ్ లో మరోసారి ధియేటర్ల రగడ మొదలైంది. సినీ పెద్దలు కలగజేసుకుని ఈ గొడవకి పరిష్కారం చూయించాలి.