అల్లు అర్జున్ ని కోలీవుడ్ ఇండస్ట్రీలో కలిపేసి క్రికెటర్..?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా తన కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ ఆ సినిమా మంచి హిట్ అవ్వటంతో ఆ తరువాత వరుస అవకాశాలు అందుకొని స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందాడు. సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఇలా సినీ సెలబ్రిటీలతోపాటు కొంతమంది క్రికెటర్లు కూడా అల్లు అర్జున్ కి వీరాభిమానులు.

టీమిండియాకి చెందిన ఒక యంగ్ క్రికెటర్ కి కూడా అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. ఇంతకీ ఎవరా క్రికెటర్ అంటే..ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన టీమిండియా యంగ్ క్రికెటర్ దావల్ కులకర్ణి . తాజాగా ఇతను ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేశాడు. మంగళవారం కొంత సమయం వాట్సాప్ పని చేయలేదు. దీంతో ఈ టైమ్‌లో ‘వాట్సాప్ డౌన్ అయ్యి ఎంత సేపు అయ్యింది. రండి ఇక్కడ చాట్ చేద్దాం..’ అంటూ దావల్ కులకర్ణి, ట్విట్టర్‌ లో ఫ్యాన్స్‌కి వెల్‌కమ్ చెప్పాడు.

అభిమానులతో సరదాగా చాట్ చేస్తున్న కులకర్ణి కి మీ ఫేవరేట్ తమిళ హీరో ఎవరు? అని ఒక అభిమాని ప్రశ్నించగా … అల్లు అర్జున్ అని సమాధానం ఇచ్చాడు. అల్లు అర్జున్ తమిళ హీరో కాదు..అని మరొక నెటిజన్ కామెంట్ చేయగా… అవన్నీ నాకు తెలియదు నా ఫేవరెట్ హీరో మాత్రం అల్లు అర్జున్ అంటూ కులకర్ణి సమాధానం ఇచ్చాడు. ఇలా టాలీవుడ్ హీరోని కోలీవుడ్ ఇండస్ట్రీలో కలిపేసాడే.. అంటూ అల్లు అర్జున్ అభిమానులు సరదాగా నవ్వుకుంటున్నారు. కానీ అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పటంతో అభిమానులు అనందపడుతున్నారు.