రామ్‌చరణ్‌తో జాన్వీ జోడీ!

రామ్‌ చరణ్‌ హీరోగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్‌సీ 16 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథా చర్చలు, మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ పూర్తయ్యాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు? అని కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేరు బయటికొచ్చినా ఎక్కువ వినిపించిన పేరు మాత్రం అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్‌దే. రామ్‌చరణ్‌తో జాన్వీ జోడీ కట్టనుందనే వార్త చాలారోజులుగా హల్‌చల్‌ చేస్తోంది.

ఇప్పుడు అదే నిజమైంది. ‘ఆర్‌సీ16’ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన హీరోయిన్‌ గా జాన్వీకపూర్‌ నటించనుంది. ఈ విషయాన్ని తన తండ్రి బోనీకపూర్‌ వెల్లడించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జాన్వీకపూర్‌ చరణ్‌తో నటించనున్న చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది’ అని స్వయంగా వెల్లడించారు.

ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ షూటింగ్‌ పూర్తయ్యాక ’ఆర్‌సీ16’ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌ నుంచి ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుందని టాక్‌ వినిపిస్తోంది. నేటివిటీ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రం తన కెరీర్‌లో అత్యుత్తమ చిత్రం కానుందని గతంలో చరణ్‌ తెలిపారు.

ఇదొక అద్భుతమైన మట్టి చిత్రమని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే! జాన్వీకపూర్‌ ‘దేవర’ చిత్రంలో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఇది ఆమెకు తెలుగులో రెండో సినిమా కానుంది. అయితే జాన్వీ కపూర్‌ ఈ చిత్రంలో ఖరారైందని బోనీ కపూర్‌ వెల్లడించినప్పటి నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

జాన్వీని హీరోయిన్‌ గా తీసుకోవడం పట్ల అభిమానులు నిరాశలో ఉన్నారు. ఆమె గ్లామర్‌ పాత్రలకు తప్ప నెటివిటీ కథలకు సూట్‌ కాదని కామెంట్లు చేస్తున్నారు. మరో నెటిజన్‌ అయితే ’ఆమెను ఎందుకు తీసుకున్నావ్‌ అన్నా.. ఒక్క హిట్‌ కూడా లేదు.. మార్చేసేయ్‌.. జాన్వీ కపూర్‌ వద్దు బాబోయ్‌’ అని కామెంట్స్‌ చేశారు.