రాజమౌళిపై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంపై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆస్కార్‌ అవార్డ్‌ వేదికపై పలువురు హాలీవుడ్‌ దిగ్గజాలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. వారిలో దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను చూసి ఆశ్చర్యపోయినట్లుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, రాజమౌళిని షేక్‌స్పియర్‌తో పోల్చారు.

రాజమౌళి కూడా జేమ్స్‌ కామెరూన్‌ని కలవడంపై స్పందించారు. ‘కలో.. నిజమో అని ఇప్పటికీ నమ్మలేక పోతున్నా.. నేను డైరెక్ట్‌ చేసిన సినిమాను అంతటి దిగ్గజ దర్శకుడు విశ్లేషించడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని రాజమౌళి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి రాజమౌళిపై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు కురిపించడంతో.. ఆర్‌ఆర్‌ఆర్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

ఆ వివరాలలోకి వెళితే.. తాజాగా 51వ వార్షిక శాటర్న్‌ అవార్డుల వేడుకను అమెరికాలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో జేమ్స్‌ కామెరూన్‌.. రాజమౌళి ప్రస్తావన తెచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఇండియన్‌ దర్శకుడు రాజమౌళి అద్భుతం చేశారు. ఆయనని కలవడం ఎప్పటికీ మరిచిపోలేను. ప్రపంచవేదికపై ఇండియన్‌ సినిమాను చూడడం హ్యాపీగా అనిపించిందని.. జేమ్స్‌ కామెరూన్‌ చెబుతున్న వీడియో ఒకటి సోషల్‌ మాధ్యమాలలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూసిన భారతీయులందరూ.. మరోసారి రాజమౌళికి థ్యాంక్స్‌ చెబుతున్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ పటంపై నిలపడమే కాకుండా.. హాలీవుడ్‌కు చెందిన దిగ్గజ దర్శకులను సైతం మెప్పించిన జక్కన్న అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌తో రాజమౌళి పేరు మరోసారి టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది.