రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరియర్‌లో 15 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రస్తుతానికి RC 15 అనే పేరుతో సంభోదిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా చెబుతున్న ఈ సినిమా కథను కార్తీక్ సుబ్బరాజు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కానీ దాని మీద క్లారిటీ లేదు. ఇక ఆయన సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని ఫిబ్రవరి 2021 సంవత్సరంలో అనౌన్స్ చేశారు. అదే ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రత్నం వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ మీద అనేక రకాల ప్రచారాలు అయితే జరిగాయి. ముందుగా ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ ఉండనుందని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఆ పేరు ఫైనల్ చేసే అవకాశం లేదని అంటున్నారు. ఇక తర్వాత అధికారి, సీఎం అంటే కామన్ మ్యాన్, సిటిజన్, సీఈవో అనే పేర్లు పరిశీలనలో ఉండగా వీటన్నింటిలో కూడా సీఈఓ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఏ పేరు ఫిక్స్ చేస్తారని విషయం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలితో పాటు ఎస్‌జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, నాజర్, రఘుబాబు, సముద్రఖని వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. సుమారు 200 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఉంది. కానీ దిల్ రాజు ఎక్కడికక్కడ కటింగ్స్ పెడుతూ సినిమాని శంకర్ రేంజ్‌లో కాకుండా కొంత తక్కువ బడ్జెట్లో పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.