రామ్ చరణ్ స్వయంకృతాపరాధం.! తప్పంతా చిరంజీవిదే.!

ప్రముఖ దర్శకుడు శంకర్‌తో కలిసి పని చేయాలన్నది చిరంజీవి డ్రీమ్.! నిజానికి, ఆ డ్రీమ్ శంకర్‌ది.! చాలాకాలం క్రితమే చిరంజీవి హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు.

లేకపోతే, ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చిరంజీవితో చాలాకాలం క్రితమే.. అంటే, చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందే తెరకెక్కి వుండేది. అప్పట్లో శంకర్‌కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిరంజీవి వెంట చాన్నాళ్ళు శంకర్ తిరిగాడు కూడా.

ఆ సినిమా చేయలేకపోయినందుకు చిరంజీవి చాలా చాలా బాధపడ్డారు. అది వేరే వ్యవహారం. తాను చేయలేకపోయినప్పటికీ, శంకర్‌తో తన కుమారుడు చరణ్ సినిమా చేస్తే బావుంటుందని చిరంజీవి ఆశపడ్డారు. ఆ కాంబినేషన్‌కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అన్నీ సెట్ చేశారు. అదే ‘గేమ్ ఛేంజర్’.

శంకర్‌తో సినిమా చేయాలని ఏ నటుడు మాత్రం అనుకోడు.? రామ్ చరణ్ కూడా అంతే. చిరంజీవి నుంచి మరింతగా ఎంకరేజ్‌మెంట్ రామ్ చరణ్‌కి ఈ విషయంలో దక్కింది. లేకపోతే, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాతి సినిమా కావడంతో చరణ్ కాస్త ఆలోచించేవాడేమో.!

అలా ఆలోచించి వున్నా బాగుండేది.! నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయ్ ‘గేమ్ ఛేంజర్’ పూర్తవడంలేదు. ‘భారతీయుడు’ సినిమా ఓ వైపు, ‘గేమ్ ఛేంజర్’ ఇంకో వైపు. వెరసి, శంకర్.. రెండు సినిమాలకీ న్యాయం చేయలేకపోతున్నాడు.

ఇక్కడ చరణ్ కెరీర్ అలా స్టాల్ అయిపోవడానికి శంకర్ కారకుడవుతున్నాడు. కానీ, ఇది పూర్తిగా చరణ్ స్వయంకృతాపరాధమే.