వెండితెరపై పారిశ్రామికవేత్త శ్రీకాంత్‌ బయోపిక్‌!

ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్‌ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది ‘అటల్‌, ది గోట్‌ లైఫ్‌’ అంటూ సినిమాలు రాగా ఈ నెలలో మైదాన్‌ అంటూ అజయ్‌ దేవ్‌గన్‌ మరో బయెపిక్‌తో రాబోతున్నాడు.

అయితే ఇప్పటివరకు మనం రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారుల జీవితాలను మాత్రమే బయోపిక్‌లుగా చూశాం. అయితే ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త లైఫ్‌ స్టోరీ తెరపై ఆవిష్కృతం కానుంది. అదికూడా తెలుగువారు కావడం విశేషం.హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంధ్ర పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్టీస్ర్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా గురించి తెలిసిందే.

హైదరాబాద్‌ సవిూపంలోని ఒక చిన్న గ్రామంలో దృష్టి లోపంతో జన్మించిన శ్రీకాంత్‌ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అన్నింటిని దీటుగా ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. చివరికి హైదరాబాద్‌లో బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ను స్థాపించాడు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతుంది.

‘శ్రీకాంత్‌’ టైటిల్‌తో ఈ సినిమా రాబోతుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు రాజ్‌ కుమార్‌ రావు హీరోగా నటిస్తున్నాడు. తుషార్‌ హీరానందానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జ్యోతిక, శరద్‌ కేల్కర్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం ఇక ఈ పోస్టర్‌లో రాజ్‌ కుమార్‌ రావు శ్రీకాంత్‌ పాత్రలో జీవించాడు అని తెలుస్తుంది. టీ సీరిస్‌, ఛాక్‌ అండ్‌ ఛీస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, నిధి పర్మార్‌ హీరానందానీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా.. 2024 మే 10న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది.