సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 పై మొదట్లో ఉన్న అంచనాలు ఇప్పుడు కాస్త తక్కువయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్‌లో హృతిక్ స్టైలిష్ లుక్ ఆకట్టుకున్నా, ఎన్టీఆర్ విజువల్స్ మాత్రం తెలుగు ప్రేక్షకుల నిరాశకు కారణమయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు చూస్తుంటే తెలుగు అభిమానుల స్పందన అంతగా బలంగా లేదు.
ఇప్పటికే రజనీకాంత్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న కూలీ సినిమా హైప్ తారాస్థాయిలో ఉంది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న రిలీజ్ కానున్నాయి. అయితే ఎనర్జిటిక్ బిజినెస్ ప్లాన్‌తో కూలి సినిమా తెలుగు మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో వార్ 2కి మిగిలిన ఆసక్తిని నిలబెట్టాలంటే ఇకపై ఎన్టీఆర్ ప్రమోషన్ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీజర్ అంచనాలు అందుకోలేకపోవడంతో ట్రైలర్ దగ్గర నుంచి స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన దశ వచ్చింది. మీడియా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, సోషల్ మీడియా ప్రచారాల్లో ఎన్టీఆర్ యాక్టివ్‌గా పాల్గొనాలి. ఎందుకంటే ఈ సినిమా బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు ఫుల్ లెంగ్త్ ఎంట్రీ. ఆయన ప్రమోషన్ లేకుండా సౌత్ మార్కెట్‌లో వార్ 2 హైప్ నిలబడడం కష్టమే. ఈ గ్యాప్‌నుపర్చే వ్యూహాలతో నిర్మాతలు, దర్శకుడు, హీరో కలిసి ముందు వేగాన్ని పెంచాలి. లేదంటే మాస్ బజ్‌లో కూలీ దూసుకెళ్లే అవకాశం ఉంది.