Pawan Kalyan: ఇటీవల వచ్చిన పవన్ కల్యాణ్ సినిమాలో కోర్టు సీన్‌లో తప్ప ప్రతీ దాంట్లో తాను ఉన్నానని, అంత మంచి ఇంపార్టెంట్ రోల్ తనకు అవకాశం రావడంపై నటుడు సమ్మెట గాంధీ స్పందించారు. ఆ పాత్ర కోసం తన కంటే ముందు చాలా మందిని చూశారని, కో-డైరెక్టర్ బాబీ చాలా మందిని తీసుకొచ్చి డైరెక్టర్‌కు చూపించారని, అందులో కొంత మంది ఆయనకు నచ్చక, పక్కనున్న వాళ్లు రాజన్న సినిమాలో చేసిన వ్యక్తి అయితే బాగుంటుందేమో అని ఆయనకు సలహా ఇచ్చారట అని ఆయన చెప్పుకొచ్చారు. అలా తన ఫొటోను డైరెక్టర్‌కు, దిల్ రాజు గారికి చూపించినపుడు ఇతన్ని ఓకే చేయండి అన్నారని ఆయన తెలిపారు. అప్పుడు తాను గుంటూరులో ఓ నాటకం వేయడానికి వెళ్లానని, ఆ సమయంలోనే బాబీ గారు తనకు ఫోన్ చేశారని గాంధీ చెప్పారు. అయితే ఆయన చెప్పిందేంటంటే రేపు రాగానే వచ్చి కలవండి, పవన్ కల్యాణ్ సినిమాలో ఓ మంచి వేషం ఉంది, మా డైరెక్టర్ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నట్టు చెప్పారని ఆయన అన్నారు.
దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కానివ్వకండి. ఆయనతో ఎప్పటినుంచో చేయాలని తనకుందని అన్నట్టు గాంధీ చెప్పారు. ఆ తర్వాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారిని తాను కలిశానని, దాంతో ఆయన ఆ సినిమా ద్వారా తనకు మంచి బ్రేక్ ఇచ్చారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
అయితే పవన్ కల్యాణ్ గారితో దాదాపు 20 రోజులు కలిసి షూట్ చేశామని, కానీ ఒక్కసారి కూడా ఆయనతో పర్సనల్‌గా మాట్లాడలేదని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన పెద్ద ఆర్టిస్ట్ అని, వారికున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదని, అంతే కాకుండా ఆయన పొలిటికల్‌గా కూడా రాణిస్తున్నారని, దానికి తోడు అనేక రకాల ఒత్తిళ్లుంటాయని, అలాంటి సిచ్యువేషన్‌లో తాను వెళ్లి మాట్లాడడం అనేది సరికాదని అనిపించినట్టు గాంధీ తెలిపారు. ఒక వేళ తాను వెళ్లి మాట్లాడినా వాళ్లు వింటారు గానీ, అయిష్టంగానే వింటారని, ఒకవేళ ఆయన్నే ఇష్టంగా అడిగితే చెప్పొచ్చు గానీ, లేదంటే మనంతట మనమే వెళ్లి మాట్లాడడం అనేది బాగోదని, అలా తనకు ఇష్టం ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు చాలా మంది పెద్ద హీరోలతో కలిసి చేసినా కూడా, కనీసం వారి దగ్గరికి వెళ్లి ఒక ఫొటో కావాలని కూడా అడగలేదని, తనకు వేషం కావాలని కూడా ఎవరి దగ్గరికీ వెళ్లి అడగలేదని ఆయన వివరించారు.