నేను నిత్య విద్యార్థిని.. నన్ను అలా పిలవద్దంటున్న కమల్ హాసన్!

సినిమా హీరోలకు వారి అభిమానులు వారికి నచ్చిన బిరుదులు ఇచ్చి వాటితోనే పిలుస్తూ మురిసిపోయేవారు. శోభన్ బాబుని నటభూషణ అని కృష్ణుని సూపర్ స్టార్ అని ఎన్టీఆర్ ని నటరత్న అని ఇలా చాలామందికి పేరు ముందు చాలా బిరుదులు ఉండేవి. అలాగే తమిళంలో కూడా నటుల పేర్లు ముందు బిరుదులు ఉండేవి. అప్పట్లో అభిమానులు అభిమానంతో బిరుదులు ఇచ్చుకుంటే ఇప్పుడు ఎవరికి వారే ట్యాగులు పెట్టేసుకుంటున్నారు.

అయితే ఈ విషయంలో తమిళ నటులు ఎందుకో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తమ పేర్లు ముందు ఉన్న బిరుదులు తమకు అక్కర్లేదని తమ పేర్లతో మాత్రమే తమ ని పిలిస్తే చాలని అభిమానులని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. ఈ మధ్యనే అజిత్ తన పేరు ముందు తల అనే బిరుదుని వాడొద్దని తనని అజిత్ లేదంటే అజిత్ కుమార్ అని పిలిస్తే చాలని, తల అనే బిరుదు తనకి చాలా ఇబ్బందిగా ఉందని తన ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశాడు.

అలాగే సూర్యని ఒక స్టేజి మీద సూపర్ స్టార్ అని పిలిస్తే తనకి అలాంటి బిరుదులు వద్దని ఇక్కడ ఉన్నది ఒకే ఒక సూపర్ స్టార్ అతను రజినీకాంత్ అని చెప్పటం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ కోవలోకి సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా చేరాడు. తనని ఎవరూ ఒలగనాయకన్ అని పిలవద్దని కమలహాసన్ ట్వీట్ చేశాడు. తనకి ఆ బిరుదు ఇచ్చినందుకు కృతజ్ఞతలు కానీ సినిమా ప్రపంచంలో తాను ఒక నిత్య విద్యార్థిని అని ఈ రంగంలో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుని ముందుకు సాగాలని ఆశిస్తున్నానని చెప్పాడు.

సినిమా ఇండస్ట్రీ అనేది ఎంతోమంది సాంకేతిక నిపుణులు ప్రేక్షకులు కళాకారుల సమాహారం, సమిష్టి కృషి అన్నాడు. తాను ఎప్పటికీ తన లోపాలను గుర్తించి మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళుతూనే ఉంటాను అని చెప్పాడు. తాను మర్యాదపూర్వకంగా స్టార్ టాగ్స్ ని తిరస్కరిస్తున్నారని తమ అభిమానులతో పాటు మీడియా సినీ ప్రముఖులు అందరూ కమల్ హాసన్ లేదంటే కేహెచ్ అనే పిలవాలని రిక్వెస్ట్ చేశాడు.