అతని పద్ధతి బాగోలేదు.. నాగ వంశీ పై మండిపడుతున్న బాలీవుడ్ నిర్మాతలు!

2024 వీడ్కోలు చెబుతూ ఓ వెబ్‌సైట్‌ దక్షిణాదితోపాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో నాగవంశీ, బోనీకపూర్‌ తో పాటు చాలామంది పాల్గొన్నారు. నాగ వంశీ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ ఉంది. తెలుగు చిత్రాలకు యూఎస్‌, తమిళ మూవీలకు సింగపూర్‌, మలేషియా, గల్ఫ్‌లో మార్కెట్‌ బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప 2’ లాంటి చిత్రాలతో మార్పు చూసి ఉంటారు.

‘యానిమల్‌’, ‘జవాన్‌’ సినిమాలు దక్షిణాది దర్శకులు తెరకెక్కించినవే. హిందీ చిత్ర పరిశ్రమ ముంబయికే పరిమితమైంది’’ అని కామెంట్‌ చేయగా బోనీ కపూర్‌ దాన్ని అంగీకరించలేదు. అమితాబ్‌ బచ్చన్‌కు తాను పెద్ద అభిమానినని బన్నీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దానిపై నాగవంశీ స్పందిస్తూ.. షారుక్‌ ఖాన్‌, చిరంజీవికీ అల్లు అర్జున్‌ పెద్ద అభిమాని అని చెప్పారు.అయితే ఈ విషయం పై బాలీవుడ్‌ దర్శక నిర్మాత సంజయ్‌ గుప్తా ఆగ్రహం వ్యక్తంచేశారు.

హిందీ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా పేరుపొందిన బోనీకపూర్‌తో నాగవంశీ మాట్లాడిన తీరును ఆయన తప్పు పట్టారు. అగ్ర నిర్మాతతో ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. టాలీవుడ్‌కు చెందిన సీనియర్స్‌తోనూ ఇలాగే ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. ‘‘బోనీకపూర్‌ లాంటి సీనియర్‌ నిర్మాత పక్కన కూర్చొని తన వ్యాఖ్య?తో ఆయన్ని ఎగతాళి చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? అతడి వైఖరి ఏమీ బాలేదు. నాలుగు హిట్స్‌ అందుకున్నంత మాత్రాన అతడు బాలీవుడ్‌కు రాజు కాలేడు. టాలీవుడ్‌కు చెందిన సీనియర్‌ నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేశ్‌బాబు వంటి వారితోనూ ఇదే విధంగా మాట్లాడగలడా? విజయం అందుకోవడం మాత్రమే కాదు..

గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి’’ అని మండిపడ్డారు.అనంతరం సంజయ్‌ మరో పోస్ట్‌ పెట్టారు.‘పుష్ప 2’ చిత్రం రూ.86 కోట్లు వసూలు చేసిన తర్వాత బాలీవుడ్‌ మొత్తం నిద్రపోలేదు’ అని నాగవంశీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సంజయ్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘‘మా ఎగ్జిబిటర్ల వల్లే ఆ సినిమా రూ.86 కోట్లు కలెక్ట్‌ చేసిందని తెలిసి మేము చాలా ప్రశాంతంగా నిద్రపోయాం. మేము మీలా కాదు. ఎదుటివాళ్ల విజయం మాకు నిద్ర లేని రాత్రులు ఇవ్వదు’’ అని అన్నారు. సంజయ్‌ మాత్రమే కాకుండా బాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శక, నిర్మాతలు నాగవంశీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.