ఐటీ దాడులపై స్పందించిన హీరోయిన్‌ తాప్సీ

Tapsee Pannu

ఆదాయపు పన్నుశాఖ అధికారుల సోదాలపై నటి తాప్సీ స్పందించింది. ఇటీవల రెండు రోజుల పాటు ఇన్‌కం టాక్స్‌ అధికారులు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, తాప్సీ ఇండ్లపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. వారికి సంబంధించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కూడా అధికారులు సీజ్‌ చేశారు. తాప్పీ రూ.650 కోట్ల పన్నుల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయమై శుక్రవారం పుణెలో ఇద్దరినీ అధికారులు ప్రశ్నించారు.

ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా శనివారం తొలిసారి ఐటీ దాడులపై పెదవి విప్పింది. దాడుల సందర్భంలో అధికారులు ప్యారిస్‌లో బంగ్లా ఉందంటూ తాళాల కోసం వెతికారని, అయితే తనకు అక్కడ ఎలాంటి బంగ్లా లేదని తెలిపింది. అలాగే రూ.5కోట్లు తీసుకున్నానంటూ రసీదుల కోసం వెతికారని, నేను ఎప్పుడూ అంత మొత్తాన్ని తీసుకోలేదని చెప్పింది.

అలాగే 2013లోనూ ఐటీ సోదాలు జరిగినట్లు ఆర్థిక మంత్రి చెప్పారని, నా నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం గుర్తు లేదన్నారు. సినీ నటుల నివాసాలపై ఐటీ దాడులకు సంబంధించి శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించిన విషయం విదితమే. ‘నేను ఎవరినీ కామెంట్‌ చేయాలనుకోవడం లేదు. 2013లో కూడా వాళ్లపై ఐటీదాడులు జరిగాయి. ఆ సమయంలో పట్టించుకోని ఈ సమస్యను ఇప్పుడు ఎందుకు ఇంత పెద్దగా చూస్తున్నారు’ అని వ్యాఖానించారు. కొద్ది రోజులుగా సినీ ప్రముఖల ఇండ్లపై ఐటీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.