మాస్ కాంబో.. సరికొత్త ప్రాజెక్ట్

మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన మిరపకాయ్ చిత్రం ఏ రేంజ్ లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలా అని లీకై ఈ విషయం వెలుగులోకి రాలేదు. మరెలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నటుడు రవితేజ #AskRavanasuraతో ట్విట్టర్‌లో అభిమానులతో ప్రశ్నోత్తరాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు హరీష్ శంకర్‌తో సినిమా ప్లాన్ చేయమని ఓ అభిమాని అడగడంతో… రవితేజ స్పందించాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ ను ట్యాగ్ చేస్తూ… ఓ ట్వీట్ చేశాడు.

‘ఏమ్మా హరీష్ శంకర్ ఎదో అడుగుతున్నారు నిన్నే..’ అని రవితేజ రాసుకొచ్చారు. ఇది చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ వెంటనే స్పందించి సమాధానం ఇచ్చారు. ‘హహహహహ… అన్నయతో నిజానికి ఓ పీరియాడికల్ డ్రామాలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను” అంటూ రీట్వీట్ చేశాడు. అతి త్వరలో తాము చరిత్రను పునరావృతం చేయబోతున్నామంటూ చెప్పుకొచ్చాడు.

రవితేజ మరియు హరీష్ శంకర్ మధ్య జరిగిన ఈ సరదా సరదా చాట్ చూస్తుంటే… వీరి కాంబో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు అర్థం అవుతోంది. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, నటీనటులు ఎవరు, అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందంటూ నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

అయితే గతంలో డైరెక్టర్ హరీష్ శంకర్, హీరో రవితేజ కాంబోలో షాక్, మిరపకాయ్ చిత్రాలు వచ్చాయి. రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేత్ లు హీరోయిన్ లుగా నటించిన మిరపకాయ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అలాగే హీరోయిన్ జ్యోతిక, రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన షాక్ సినిమా కూడా హిట్టుగా నిలిచింది. ఈ క్రమంలోనే మరోసారి రాబోతున్న ఈ న్యూ కాంబో ఏ రేంజ్ లో హిట్టు కొట్టనుందో చూడాలి.